Weekend Getaways From HYD: వీకెండ్ మునుపెప్పుడూ లేనంతగా ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే!
మీ పరిధిలోనే ప్రకృతి రమణీయమైన చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. దట్టమైన అడవిలో నుంచి జారే జలపాతం, సఫారీ రైడ్, స్వచ్ఛమైన తాటికల్లు, అచ్ఛమైన దేశీ నాటుకోడి కూర ఇంకా ఎన్నో అనుభూతులు.
తిన్నామా.. పని చేసుకున్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా.. అని ఓ సినిమాలో డైలాగ్ లాగా ఒక్కోసారి లైఫ్ లో ప్రతీరోజూ ఒకేలా అనిపిస్తుంది. ఇప్పటి జెనరేషన్ లో అందరూ ఎవరి పనుల్లో వారు బిజీబిజీ, ఇంట్లో వాళ్లతో కూడా గడిపే టైం కూడా చాలా తక్కువే.
ఈ ఒత్తిడితో ఒక్కోసారి మైండ్ అంతా హీట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోతుందా అనిపిస్తుంది. వారం మొత్తం పనిచేయండం, వారాంతం (Weekend) వచ్చేసరికి బాడీలో బ్యాటరీ అంతా డౌన్ అయిపోయి బెడ్ మీద పడిపోవటం ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది.
దీని నుంచి బయటపడాలంటే బాడీకి కొంత రీఫ్రెష్‌మెంట్ (Refreshment) చాలా అవసరం. దీనికి ఒకటే పరిష్కారం -వారాంతంలో ఎక్కడికైనా ఎస్కేప్ అవటమే. మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవటానికి హైదరాబాద్ కు (HYD) దగ్గర్లో చాలానే పర్యాటక ప్రాంతాలు (Getaways) మిమ్మల్ని రారామ్మంటూ మీకోసం ఎదురుచూస్తున్నాయి. అవేంటో, ఎలా వెళ్లాలో ఒకసారి చెక్ చేసుకోండి.
ఆదిలాబాద్ జిల్లా: కుంటాల, పొచ్చెర జలపాతాలు, కవాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, సఫారీ.
హైదరాబాద్ నుంచి దాదాపు 280 కి మీ దూరం ఉంటుంది. రోడ్డు మార్గంలో మాత్రమే చేరుకునే వీలుంది. హైదరాబాద్ నుంచి నేరుగా నేషనల్ హైవే 44 ద్వారా చేరుకోవచ్చు, రోడ్డు మార్గం 4 లైన్లతో అందంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. 4 టోల్ గేట్లు వస్తాయి.
ముందుగా నిర్మల్ చేరుకుని అక్కడ్నించి, అదే మార్గంలో మరో 50 కి. మీ ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ రెండు జలపాతాలకు మధ్య 10 కి. మీ వ్యత్యాసం ఉంటుంది.
చుట్టూ అడవి, పచ్చదనం మధ్య కుంటాల జలపాతం గలగలమని శబ్దం చేస్తూ కిందకు దూకుతుంది. జలపాతం అగ్రభాగాన ఒక గుహలో శివలింగం వెలిసింది. కేవలం శివరాత్రి రోజు మాత్రమే అందులో దర్శనానికి వెళతారు. కానీ వెళ్లడం అత్యంత ప్రమాదకరం.
ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి. కుంటాల జలపాతం వద్ద టిఫిన్స్, మీల్స్ అందుబాటు ధరలలోనే లభిస్తాయి. దేశీయ నాటుకోళ్లను అప్పటికప్పుడే ఆర్డర్ పై వండి, వడ్డిస్తారు.
ఇక్కడ్నించి 10 కి. మీ దూరం వెనక్కి అవతలి వైపు ప్రయాణిస్తే బోథ్ మండలంలో పొచ్చెర జలపాతం ఉంది. ఈ జలపాతం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి పరిసరాలను చూస్తే మిమ్మల్ని మీరు మైమరిచిపోతారు.
అయితే ఇక్కడ బస చేయడానికి ఎలాంటి వసతులు లేవు, తిరిగి నిర్మల్ జిల్లా కేంద్రంలోనే ఉండటానికి వీలుంటుంది. ఇక్కడే ప్రసిద్ధి చెందిన కొయ్యబొమ్మలు షాపింగ్ చేసుకోవచ్చు.
నిర్మల్ నుంచి పడమర వైపు 70 కి. మీ ప్రయాణిస్తే బాసర పుణ్యక్షేత్రం వస్తుంది, అలాకాకుండా తూర్పువైపు 70 కి. మీ ప్రయాణిస్తే కవాల్ అభయారణ్యం వస్తుంది. వైల్డ్‌లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, సఫారీ రైడ్ కి వెళ్లాలనుకుంటే ఇటువైపు వెళ్లొచ్చు. తెలంగాణ టూరిజం శాఖకు చెందిన హరిత రిసార్ట్స్ లో ఇక్కడ ట్రావెలర్స్ కి తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు.
Adilabad Wild Life:
వరంగల్ జిల్లా, పాకాల లేక్, రామప్ప, లక్నవరం లేక్, కాకతీయుల చారిత్రక కట్టడాలు
హైదరాబాద్ నుంచి 150 కి. మీ దూరంలో వరంగల్ కేంద్రం ఉంటుంది. రెలు లేదా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. ఈ జిల్లాలో కాకతీయుల కాలం నాటి చారిత్రాత్మక కట్టడాలు చాలా చూడొచ్చు, వరంగల్ జిల్లా కేంద్రంలో వేయి స్థంభాల గుడి, మహంకాలి టెంపుల్ ప్రాముఖ్యమైనవి.
వరంగల్ చుట్టూ 60 కి,మీ దూరంలో ఎన్నో చారిత్రాత్మక, ప్రకృతి సిద్ధమైన చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే అందమైన సరస్సుగా చెప్పబడే పాకాల చెరువు ఇక్కడే ఉంది.
వరంగల్ కు 70 కి. మీ దూరంలో లక్నవరం లేక్ ఉంది, ఈ చెరువులో 160 మీ పొడవైన హాంగింగ్ బ్రిడ్జ్ ఉండటం దీని ప్రత్యేకత, బోటింగ్ కూడా అభివృద్ధి చేశారు. వరంగల్ లో క్యాబ్ రెంట్ తీసుకొని ఈ ప్రాంతాలన్నీ 1 లేదా 2 రోజుల్లో చుట్టేయొచ్చు.
పైన పేర్కొన్న ఆదిలాబాద్, వరంగల్ లోని పర్యాటక ప్రాంతాలలో మార్గమధ్యలో చాలా తాటిచెట్లు ఉంటాయి. స్వచమైన తాటికల్లు అప్పటికప్పుడే చెట్టునుంచి తీసి ఇస్తారు. దీనిని కూడా మిస్ అవ్వొద్దు.
Weekend Getaways From Hyderabad:
హైదరాబాదుకు దగ్గర్లో బీచ్ ను ఎంజాయ్ చేయాలంటే సూర్యలంక బీచ్ ఉంది. సూర్యలంక బీచ్ కు వెళ్లాలంటే ముందు ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల చేరుకోవాలి. హైదరాబాదు నుంచి 310 కి. మీ ఉన్న బాపట్లకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. అక్కడ్నించి 8 కి. మీ దూరంలో సూర్యలంక బీచ్ ఉంటుంది. ఇక్కడ ఉండటానికి ఆంధ్రప్రదేశ్ టూరిజంకు చెందిన హరిత బీచ్ రిసార్ట్స్ ఉన్నాయి.
బీచ్ కు అభిముఖంగా ఉండే ఈ రిసార్ట్స్ ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయి. ఉదయం, సాయంత్రం బీచ్ లో అక్కడే సమయం గడపొచ్చు, బీచ్ వాలీబాల్ లాంటివి కూడా ఆడుకోవచ్చు. క్రౌడ్ కూడా మామూలుగానే ఉంటుంది కాబట్టి ఈ బీచ్ మిగతా బీచ్ లతో పోలిస్తే పరిశుభ్రంగా ఉంటుంది.
బీచ్ రిసార్ట్స్ లలో డీలక్స్, ఏసి స్టాండర్డ్, నాన్ ఏసి రూంలు అందుబాటులో ఉన్నాయి.
డీలక్స్ రూంలలో నుంచి బీచ్ స్పష్టంగా, దగ్గరగా కనిపిస్తుంది. ఈ డీలక్స్ గదుల వెనకాల మిగతా గదులు ఉంటాయి.
ఫుడ్ హరిత క్యాంటీన్ లో లభిస్తుంది కాస్త ఖరీదు ఎక్కువే, బయట లోకల్ గా చాలా తక్కువగా చిన్నచిన్న మెస్ లు ఉన్నాయి, చేపలు ఫ్రెష్ గా ఫ్రై చేసి ఇస్తారు. ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కావాలంటే ఒక రెండు కి. మీ దూరం ఊర్లోకి వెళ్లాల్సిందే.
ఈ సూర్యలంక బీచ్ కు దగ్గర్లోనే చీరాల బీచ్ కూడా ఉంటుంది. అది కూడా ఈ బీచ్ లాంటి అనుభూతినే అందిస్తుంది.
వీటితో పాటు, హైదరాబాద్ కు దగ్గర్లో నాగార్జునా సాగర్ డ్యాం, ఎత్తిపోతల జలపాతం, శ్రీశైలం, అనంతగిరి ఫారెస్ట్, బీదర్ ఫోర్ట్ లాంటి ప్రాంతాలు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.