Sabarmati Express Derailed: సబర్మతి ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం.. ఇంజిన్ ను ఢీకొన్న వస్తువు.. పట్టాలు తప్పిన 22 బోగీలు.. ప్రయాణికులు సేఫ్.. ట్రాక్ మీదకు ఆ మిస్టరీ వస్తువు ఎలా వచ్చింది?
శనివారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పై ఉన్న ఓ వస్తువును సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలు ఇంజిన్ ఢీకొట్టింది.
Newdelhi, Aug 17: వారణాసి-అహ్మదాబాద్ మధ్య నడుస్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ కు (Sabarmati Express) పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పై ఉన్న ఓ వస్తువును సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలు ఇంజిన్ ఢీకొట్టింది. దీంతో 22 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే రైలులో ఉన్న ప్రయాణికులకు ఏమీ కాలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను బస్సుల్లో కాన్పూర్ తరలించారు. అక్కడి నుంచి అధికారులు వారికోసం ప్రత్యేక రైలును ఏర్పాటుచేశారు.
ఏమిటీ ఆ వస్తువు?
సబర్మతి రైలు ఇంజిన్ ను ఢీకొన్న వస్తువు ఆనవాళ్లను 16వ బోగీ వద్ద గుర్తించారు. ఆ వస్తువును భద్రపరిచారు. ఆ వస్తువు ట్రాక్ మీదకు ఎలా వచ్చింది? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.