Modi on Chandrayaan-3: చంద్రయాన్-3 దిగిన ప్రాంతం 'శివశక్తి పాయింట్', చంద్రయాన్-2 క్రాష్ అయిన ప్రదేశం 'తిరంగా పాయింట్'.. నరేంద్ర మోదీ నామకరణం.. బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలతో భేటీ అయిన ప్రధాని
ఈ చారిత్రాత్మక ఘటన చోటు చేసుకుంటున్న సమయంలో ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు.
Newdelhi, Aug 26: చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్ ద్వారా జాబిలిపై భారత్ (India) సగర్వంగా అడుగుపెట్టి జాతీయజెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక ఘటన చోటు చేసుకుంటున్న సమయంలో ప్రధాని మోదీ (PM Modi) దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. బ్రిక్స్ సమ్మిట్ (BRICS Summit) కోసం ఆయన సౌతాఫ్రికాలో ఉండిపోయారు. అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన ప్రధాని బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మన ఖ్యాతిని దిగంతాలకు చాటిన ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపించారు.
పేర్లకు అర్థం ఇదే..
చంద్రుడిని విక్రమ్ ల్యాండర్ తాకిన ప్రదేశానికి 'శివశక్తి పాయింట్' అని మోదీ నామకరణం చేశారు. ఇప్పటి నుంచి ఆ ప్రాంతం ఇదే పేరుతో పిలవబడుతుందని చెప్పారు. శివశక్తి అనే పదం కష్టానికి గుర్తు అని... మహిళా శాస్త్రవేత్తల స్ఫూర్తి, సాధికారతకు నిదర్శనమని అన్నారు. ఇదే సమయంలో చంద్రయాన్-2 మిషన్ కు సంబంధించి విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయిన ప్రాంతానికి కూడా మోదీ పేరు పెట్టారు. చంద్రయాన్-2 క్రాష్ అయిన ప్రాంతానికి 'తిరంగా పాయింట్' అని నామకరణం చేశారు. చంద్రుడిపై మన మువ్వన్నెల పతాకం ఎగురుతూనే ఉంటుందని చాటి చెప్పేలా ఈ పేరును పెట్టారు.