Uttarakhand Shocker: గుండెపోటుతో పెళ్లి పీటల మీదే మృతి చెందిన వరుడు.. వధువు చేయి పట్టుకుని ఏడడుగులు వేస్తుండగా విషాదం.. ఉత్తరాఖండ్ లో ఘటన
వధువు చేతిలో చెయ్యేసి ఏడడుగులు నడుస్తుండగా గుండెపోటుతో వరుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
Newdelhi, Feb 12: మృత్యువు ఏ రూపంలో వస్తుందో మనం అంచనా వేయలేం.. అప్పటివరకు ఆనందోత్సాహంతో మన మధ్య ఉన్నవారే.. అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతుంటారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న వివాహంలో (Marriage) విషాదం చోటుచేసుకుంది. వధువు (Bride) చేతిలో చెయ్యేసి ఏడడుగులు నడుస్తుండగా గుండెపోటుతో (Heart Attack) వరుడు (Groom) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) నంద్‌పూర్ కఠ్గరియాలో జరిగిందీ ఘటన.
సమీర్ ఉపాధ్యాయ (30) అనే దంత వైద్యుడి వివాహం శుక్రవారం జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వరుడిని ఊరేగింపుగా పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం వివాహ తంతు మొదలైంది. వధువుతో కలిసి ఏడడగులు వేస్తున్న సమయంలో సమీర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కార్డియాక్ అరెస్టుతో సమీర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు.
వరుడు ప్రదక్షిణలు చేస్తున్న క్రమంలో కుప్పకూలాడని బంధవులు తెలిపారు. పెళ్లి సమయంలో జరిగిన ఈ సంఘటన విని అందరూ షాక్ అవుతున్నారు. మొదట వరుడిని కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో పెద్దాసుపత్రికి తరలిస్తుండగా వరుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.