Independence Day 2022: వైరల్ వీడియో... అంతరిక్షంలో భారత జాతీయ పతాకం రెపరెపలు, భూమికి 30 కిలోమీటర్ల పైన మెరిసిన మువ్వన్నెల జెండా
ప్రతి ఇంటా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకాలు ( Indian flags) దేశానికి కొత్త అందాలు తీసుకొచ్చాయి.ఇక గగన వీధిలో సైతం దేశ పతకాం రెపరెపలాడింది.
స్వాతంత్య్ర వజ్రోత్సవాన యావత్ భారతం మువ్వన్నెల రంగులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ప్రతి ఇంటా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకాలు ( Indian flags) దేశానికి కొత్త అందాలు తీసుకొచ్చాయి.ఇక గగన వీధిలో సైతం దేశ పతాకం రెపరెపలాడింది. మనం నివసించే భూమికి 30 కిలోమీటర్ల ఎత్తులోనూ మన జాతీయ జెండా (Indian flag unfurled 30 kilometres above the planet) ఎగురుతూ నింగికే శోభను తీసుకొచ్చింది. స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ అనే సంస్థ బెలూన్ సాయంతో 1,06,000 అడుగుల ఎత్తుకి జాతీయ జెండాను పంపి ఆవిష్కరించింది.
సముద్రం అడుగున మువ్వన్నెల రెపరెపలు.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..
స్పేస్ కిడ్జ్ ఇండియా అనేది దేశానికి యువ శాస్త్రవేత్తలను అందించేందుకు కృషి చేస్తున్న సంస్థ. హద్దులు లేని ప్రపంచం కోసం చిన్నారుల్లో అవగాహన కల్పిస్తోంది. ఇటీవల లోఎర్త్ ఆర్బిటర్‌లోకి ఉపగ్రహం ‘ఆజాదీశాట్’ను ప్రయోగించింది. దేశవ్యాప్తంగా 750 మంది విద్యార్థినులతో ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. అయితే, దీనిని మోసుకెళ్లిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ) ఉపగ్రహాన్ని కక్ష్యలో పెట్టడంలో విఫలమైంది.
Here's Video
దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ అంతరిక్షం నుంచి కూడా సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి ఒక వీడియో సందేశాన్ని పంపుతూ భారత్‌కు 75 వసంతాల స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, భారతీయ అమెరికన్ వ్యోమగామి రాజాచారి కూడా ఆసక్తికర ఫొటోలు షేర్ చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన తండ్రి నగరమైన హైదరాబాద్ ఎలా వెలిగిపోతోందో అంతరిక్షం నుంచి వీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. భారతీయ అమెరికన్లు నిత్యం పురోగమిస్తున్న వాటిలో నాసా కూడా ఒకటని అన్నారు. ఈ సందర్భంగా అంతరిక్ష కేంద్రంలో భారత పతాకాన్ని ఆవిష్కరించిన ఫొటోలను షేర్ చేశారు.