Mother Not Legal Heir of Married Son: మరణించిన కొడుకు ఆస్తిపై తల్లికి హక్కు ఉండదు.. అసలైన వారసులు భార్య, పిల్లలే.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. ఒకవేళ బాధితుడికి భార్య, పిల్లలు లేకపోతే, ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది అంటే?
మరణించిన కుమారుడి ఆస్తిపై తల్లికి ఎలాంటి హక్కు ఉండదని, భార్య, పిల్లలకు మాత్రమే ఆస్తిపై హక్కు ఉంటుందని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
Newdelhi, Nov 20: మరణించిన కుమారుడి (Dead Son) ఆస్తిపై (Property) తల్లికి (Mother) ఎలాంటి హక్కు ఉండదని, భార్య, పిల్లలకు మాత్రమే ఆస్తిపై హక్కు ఉంటుందని మద్రాస్ హైకోర్టు (Madras Highcourt) సంచలన తీర్పును వెలువరించింది. 2012లో మరణించిన తన కుమారుడి ఆస్తిలో వాటా కావాలంటూ ఓ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. తమిళనాడులోని నాగపట్టణంకు చెందిన మోసెస్‌కు భార్య, ఒక కూతురు ఉన్నారు. 2012లో మోసెస్ మరణించటంతో ఆస్తిలో తనకు వాటా కావాలని, అతడి తల్లి మేరీ కోర్టును ఆశ్రయించారు. జిల్లా కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పగా, మోసెస్ భార్య మద్రాస్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
మృతుడికి భార్యా పిల్లలు లేకపోతే
కేసు విచారణలో భాగంగా కోర్టు స్పందిస్తూ.. ‘వారసత్వ చట్టం సెక్షన్ 42 ప్రకారం, మృతుడికి భార్యా పిల్లలు లేకపోతే.. అతడి తండ్రికి ఆస్తి చెందుతుంది. తండ్రిలేని సమయంలో తల్లి, సోదరులు, సోదరీమణులకు ఆస్తిపై హక్కు ఉంటుంది’ అన్న న్యాయవాది వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.