Liquors to Sanitisers: అపాయంలో కూడా ఉపాయం, లాక్‌డౌన్‌తో లిక్కర్ సేల్స్ లేకపోవడంతో శానిటైజర్లను ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ డిస్టల్లరీస్

శానిటైజర్ల తయారీకి ముఖ్యంగా ఉపయోగించే పదార్థం అల్కాహాల్ అని తెలిసిందే. 60% పైగా అల్కాహాల్ ఉండే శానిటైజర్ ఉపయోగించాలని వైద్యుల సూచన. సాధారణంగా మద్యంలో....

Hand Sanitisers Production in Telangana- Representational Image. |File Photo

Hyderabad, April 7: 'కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తడు.. కానీ దిమాఖ్ ఉనోడు దునియా మొత్తం చూస్తడు' అని ఒక పాపులర్ సినిమా డైలాగ్. అయితే ఇది నిజమే అని నిరూపిస్తున్నారు తెలంగాణలోని లిక్కర్ డిస్టల్లరీస్ (Telangana Distilleries). లాక్ డౌన్ ప్రభావంతో అత్యవసరాలు, నిత్యావసరాలు మినహా మిగతా అన్ని ఉత్పత్తులు నిలిచిపోయాయి. ముఖ్యంగా రాష్ట్రాలకు భారీగా ఆదాయం సమకూర్చే 'మద్యపానం' అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక అమ్మకాలే లేనప్పుడు ఉత్పత్తి ఏం లేభం? దీంతో చాలా వరకు లిక్కర్ డిస్టల్లరీస్ మూతబడ్డాయి.  భారతదేశంలో లాక్‌డౌన్ పొడగించాలని ప్రధానమంత్రిని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ డిస్టల్లరీస్ ఉపాయాన్ని ఆలోచించాయి. కోవిడ్-19 (Coronavirus Outbreak) ను నివారణ చర్యల్లో భాగంగా ఉపయోగించే శానిటైజర్లను (Hand Sanitisers) ఉత్పత్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్ డాగ్ సహా ఇతర అన్ని ప్రముఖ లిక్కర్ IMFL తయారీ సంస్థలు శానిటైజర్లను ఉత్పత్తి చేస్తూ కోవిడ్-19 వ్యతిరేక పోరాటంలో తమ వంతు సహాకారాన్ని అందిస్తున్నాయి. శానిటైజర్ల తయారీకి ముఖ్యంగా ఉపయోగించే పదార్థం అల్కాహాల్ అని తెలిసిందే. 60% పైగా అల్కాహాల్ ఉండే శానిటైజర్ ఉపయోగించాలని వైద్యుల సూచన. సాధారణంగా మద్యంలో 40 % శాతం అల్కాహాల్ ఉంటుంది. ఇప్పుడు అల్కాహాల్ శాతాన్ని పెంచి మద్యానికి బదులు శానిటైజర్లను తయారు చేస్తున్నాయి రాష్ట్రంలోను మద్యం తయారీదారులు.

కోవిడ్-19 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో శానిటైజర్ల వినియోగం జరుగుతుంది, అందుకు సరిపడా ఉత్పత్తి కూడా జరగాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ మరియు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA- Drug Control Administration) అనుమతి పొందిన 23 డిస్టల్లరీస్ నిర్ధిష్ట ప్రమాణాల మేరకు  ఇప్పటివరకు 40 వేల శానిటైజర్ల బాటిళ్లను ఉత్పత్తి చేసినట్లు తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ తెలిపింది. రోజుకు 5000 లీటర్ల శానిటైజర్ తయారీకి హైదరాబాద్ పరిధుల్లో ఉండే డిస్టల్లరీలకు తాత్కాలిక అనుమతులు మంజూరు చేసినట్లు డీసీఎ డైరెక్టర్ జనరల్ ప్రీతి మీనా వెల్లడించారు.