Thailand: యూట్యూబ్ స్టార్ భారీ మోసం, ఫాలోవర్లకు ఏకంగా రూ.437 కోట్లు కుచ్చు టోపీ పెట్టింది, మోసపోయామని గ్రహించి నట్టిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె అభిమానులు
తమ పెట్టుబడులపై భారీ రాబడి ఇప్పిస్తానని మాటిచ్చి సుమారు 77 మిలియన్ డాలర్లకు(77 Million Singapore Dollars) (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 437కోట్లు) కుచ్చుటోపీ పెట్టింది.
వీదేశీ మారకపు వ్యాపారం పేరుతో వేలాది మంది అభిమానులను ఓ యూట్యూబ్ స్టార్ (YouTube Star Nutty) నట్టేట ముంచింది. తమ పెట్టుబడులపై భారీ రాబడి ఇప్పిస్తానని మాటిచ్చి సుమారు 77 మిలియన్ డాలర్లకు(77 Million Singapore Dollars) (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 437కోట్లు) కుచ్చుటోపీ పెట్టింది. థాయ్‌లాండ్‌కు చెందిన నత్తమోన్ ఖోంగోచక్ అనే యుయవతి తన డ్యాన్స్ వీడియోలు యూట్యూబ్‌లో పోస్టు చేయడం ద్వారా లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ముద్దుగా నట్టి అని పిలుచుకునే ఈ బ్యూటీకి ప్రస్తుతం 8,44,000 ఫాలోవర్స్ ఉన్నారు.
ఈ నేపథ్యంలో విదేశీ మారకంలో (Forex Scam) పెట్టుబడి పెడితే 35 శాతం అధికంగా లాభాలు వస్తానని అభిమానులను, ఫాలోవర్లను నమ్మించింది. నట్టి మాటలను నమ్మిన ఆమె ఫాలోవర్స్ దాదాపు 6వేల మంది డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. అయితే ఉన్నట్టుండి నట్టి తన చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో.. మే నెలలో పెట్టుబడిదారులకు తాను 1 బిలియన్ భాట్ (27.5 మిలియన్ డాలర్లు) బకాయిపడ్డానని చెప్పింది.
నాకు బ్రోకర్‌గా వ్యవహరించిన వ్యక్తి గత మార్చి నుంచి తన ట్రేడింగ్‌ను ఖాతాను, నిధులను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. త్వరలోనే ఫాలోవర్స్ పెట్టుబడులు తిరిగి చెల్లించేందకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. చివరకు నట్టి మోసం చేసిందని, తాము మోసపోయామని బాధితులు థాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు 102 మంది 30 మిలియన్ భాట్‌లు(6 కోట్ల 50 వేలు) కోల్పోయినట్లు ఫిర్యాదు చేయగా.. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని పోలీసులు తెలిపారు.