YS Jagan Slams CM Chandrababu: ఎక్కడ ఏం జరిగినా జగనే కారణమంటారు, చంద్రబాబుపై విరుచుకుపడిన వైఎస్ జగన్, ఇకనైనా జగన్నామం ఆపు అంటూ ఎద్దేవా
అనంతరం రమణక్కపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడ ఏమాదిరిగా అతలాకుతలం అయ్యిందో.. అదే తరహాలో ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత అన్నారు.
Vjy, Sep 13: పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు ముంపు గ్రామాల్లో ఇవాళ వైఎస్ జగన్ పర్యటించారు. అనంతరం రమణక్కపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడ ఏమాదిరిగా అతలాకుతలం అయ్యిందో.. అదే తరహాలో ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత అన్నారు.
ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్‌మెంట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం (YS Jagan Slams Chandraabu on Floods) వహించింది. భారీగా వర్షాలు పడతాయని రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణ శాఖ నుంచి ఆగష్టు 31వ తేదీనే సమాచారం అందింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు.. ప్రజలను అప్రమత్తం చేయలేదు. కనీసం కలెక్టర్లతో కూడా రివ్యూ చేయలేదు. చంద్రబాబుకి ఏమాత్రం మానవతా విలువలు ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించేవారు. ఏలేరూ రిజర్వాయర్‌కు వచ్చే ఇన్‌ఫ్లోను ఎందుకు మేనేజ్ చేయలేకపోయారు. రిజర్వాయర్ నిండేవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆ తర్వాత కిందకు వదిలారు. ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం. ఇది మ్యాన్‌మేడ్ ఫ్లడ్స్ అని మండిపడ్డారు.
గోబెల్స్ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస. అబద్ధాలను మ్యానుఫ్యాక్చర్ చేయడంలో దిట్ట. వాటిని అమ్ముకోగలిగే కెపాసిటీ ఈ భూమ్మీద కేవలం ఒక్క చంద్రబాబుకే ఉంది అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలను ఇబ్బంది చేయడమే కాకుండా చంద్రబాబు ఇప్పుడు జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. అధికారంలో వచ్చి ఇన్నిరోజులు గడిచినా.. తాను చేయాల్సిన పనులేవీ చేయలేదు. దానంతటికి కారణం జగనే అంటారు. ఎక్కడ ఏం జరిగినా.. జగన్ పేరే చెప్తారు..
చంద్రబాబూ.. ఇకనైనా జగన్నామం ఆపు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచింది. చేయాల్సిన దాని గురించి ఆలోచించు. నిజాయితీగా పాలన చేయడం నేర్చుకో. ప్రజలకు న్యాయంగా, ధర్మంగా ఇవ్వాల్సిన దాని మీద ధ్యాస పెట్టు అని చంద్రబాబుకి జగన్ హితవు పలికారు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారాలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ఎల్లో మీడియా తోడైయ్యింది’’ అని జగన్ పేర్కొన్నారు.
ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థనలనూ నాశనం చేశారు. రైతులకు పెట్టుబడి సాయం చేయడం లేదు. పంటల బీమా ప్రీమియమ్ కూడా కట్టడం లేదు. వ్యవసాయ సీజన్ మొదలైంది. వారికి అందాల్సిన సున్నా వడ్డీ పంట రుణాలు ఏమయ్యాయి?. పెట్టుబడి సాయం రైతు భరోసా ఏమైంది? రూ.20 వేలు ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
రైతులకు పంట నష్టం జరిగితే, గతంలో అన్ని వ్యవస్థలు పక్కాగా ఉండేవి. ఆర్బీకేలు ఉండేవి. ఇన్సూరెన్స్ ఉండేది. ఇన్‌పుట్ సబ్సిడీ ఉండేది. రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని విధాలుగా ఆదుకునే వాళ్లం. కానీ ఇప్పుడు అవేవీ లేవు. గతంలో రైతులకు ఎంత వచ్చేది? ఒక్కసారి ఆలోచించండి.
ఇప్పుడే కనుక జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే.. రైతులకు పెట్టుబడి సాయం అంది ఉండేది. సీజన్ ప్రారంభంతోనే సాయం చేసి ఉండేవాళ్లం. గతంలో పంట నష్టం జరిగితే హెక్టార్‌కు రూ.17 వేలు ఇచ్చాం. గతంలో చంద్రబాబు హయాంలో అది కేవలం రూ.15 వేలు మాత్రమే. ప్రీమియం కట్టి ఉండే వాళ్లం కాబట్టి రూ.24 వేల నుంచి రూ.25 వేల వరకు బీమా పరిహారం వచ్చేది. దాంతో పాటు, పెట్టుబడి సాయం, సున్నా వడ్డీ కింద దాదాపు రూ.5 వేల వరకు.. అన్నీ కలిపి రైతులకు ప్రతి ఎకరాకు దాదాపు రూ.45 వేల వరకు సాయం అంది ఉండేది.
కానీ, ఈ పెద్ద మనిషి(చంద్రబాబు) ఏం చెబుతున్నారు?. ఎకరాకు రూ.10 వేలు ఇస్తానన్నారు. ఎలా? ఈ–క్రాపింగ్ లేదు.. అడిటింగ్ లేదు. ఆర్బీకే వ్యవస్థ లేదు. ఇంకా ఇన్సూరెన్స్ గురించి చెప్పడం లేదు. బాబు హయాంలో కేవలం రూ. 3 వేల కోట్లే వచ్చింది. ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1250 కోట్ల చెల్లించకపోవడంతో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించలేదు. భరోసా గురించి నోరు మెదపరు. ఇన్ని విధాలుగా రైతులు నష్టపోతున్నా.. చంద్రబాబు మాత్రం నిజం మాట్లాడరు.
చంద్రన్న వస్తే రూ.20 వేల ఇస్తానని మోసం చేశారు. రూ.15 వేలు ఇస్తానని బడి పిల్లలను మోసం చేశారు. రూ. 18వేలు ఇస్తానని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. ఏడాదికి రూ. 36 వేల నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. రూ. 2 వేలకోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు. విద్యాదీవెన, గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. లా అండ్‌ఆర్డర్ గాలికొదిలేశారు. బాధితులపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. వరద బాధితులకు కనీసం పునరావాసం కూడా కల్పించడం లేదు. పవన్ కల్యాణ్ ఓ సినిమా ఆర్టిస్ట్, చంద్రబాబు ఓ డ్రామా ఆర్టిస్ట్ అని జగన్ చెప్పారు.
ఏలేరు ఆధునికీకరణపైనా చంద్రబాబు అబద్దాలు చెప్పారని విమర్శలు గుప్పించారు. ఏ కెనాల్ ఆధునికీకరణ అయినా, అందులో నీళ్లు లేనప్పుడు, క్రాప్ హాలీడే ప్రకటిస్తే తప్ప, అది సాధ్యం కాదు. ఏలేరుకు ఆధునీకరణ పనులను 2008లో నిధులు కేటాయించి మరీ దివంగత మహానేత వైఎస్సార్ ప్రారంభించారు. ఆయన తర్వాత ఆ కార్యక్రమాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 2014లో ఇదే చంద్రబాబు సీఎం అయ్యాక, అంచనాలు పెంచారు తప్ప, పనులు మాత్రం చేయలేదు. నిజానికి అప్పుడు రిజర్వాయర్‌లో నీళ్లు కూడా పెద్దగా లేవు.
2015లో అంచనాలు రూ.295 కోట్లకు పెంచినా, పనులు పూర్తి చేయలేదు. మా హయాంలో ప్రతీ సంవత్సరం వర్షాలు పడి రిజర్వాయర్‌లు నిండుగా ఉన్నాయి. ఆ టైంలో క్రాప్ హాలీడే ప్రకటించడం ఇబ్బంది అవుతుందనే.. కాలువ ఆధునికీకరణ పనులు వేగంగా చేయలేకపోయాం. మరి చంద్రబాబు హయాంలో నిత్యం కరువే కదా. ఆ టైంలో ఎందుకు చేయలేకపోయారు?. చేయాల్సింది చేయకపోగా.. గత ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో కాలయాపన చేస్తున్నారు’’ అని జగన్ మండిపడ్డారు.