YCP Leader Goes Viral: టోల్ ఫీజ్ కట్టేందుకు నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్ వాగ్వాదం, టోల్ ప్లాజా సిబ్బంది చెంప చెల్లుమనిపించిన వైసీపీ నాయకురాలు, వైరల్ అవుతున్న వీడియో
టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లడమే కాకుండా తమ సిబ్బందిని దుర్భాషలాడుతూ, చేయి చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, టోల్ ప్లాజా సిబ్బంది వికృత ప్రవర్తనే ఈ సంఘటనకు దారితీసిందని
Guntur, December 10: ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్, వైసీపీ నాయకురాలు దేవళ్ల రేవతి గురువారం గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద రభస సృష్టించారు. టోల్ ఫీజు చెల్లించి వెళ్లాలని తన వాహనాన్ని టోల్ ప్లాజా సిబ్బంది ఆపినపుడు రేవతి వారితో వాగ్వివాదానికి దిగారు. తననే టోల్ ఫీజు కట్టమంటారా అంటూ వారితో దుర్భషలాడినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ టోల్ ప్లాజా సిబ్బంది వినలేదు, వాహనాన్ని వెళ్లనివ్వకుండా బారికేడ్లు అడ్డు పెట్టారు. దీంతో సహనం కోల్పోయిన రేవతి బారికేడ్లు తోసివేసి ఒక సిబ్బంది కాలర్ పట్టుకొని బెదిరించింది. ఇదే ఊపులో ఒకరి చెంప చెల్లుమనిపించింది, ఈ తతంగం అంతా వీడియో చిత్రీకరణ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది.
దేవళ్ల రేవతిపై టోల్ ప్లాజా సిబ్బంది మంగళగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లడమే కాకుండా తమ సిబ్బందిని దుర్భాషలాడుతూ, చేయి చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, టోల్ ప్లాజా సిబ్బంది వికృత ప్రవర్తనే ఈ సంఘటనకు దారితీసిందని రేవతి ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆమె వెల్లడించారు.
దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఈ తరహా ఘటనలు చాలా జరుగుతున్నాయి. కొన్నిరోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో టోల్ ఫీజు చెల్లించమని అడిగినందుకు కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా సిబ్బందిపై దాడి చేశారు. అయితే టోల్ ప్లాజా సిబ్బందిపై కూడా అనేక అరోపణలు ఉన్నాయి. సిబ్బంది వారికి తెలిసిన వ్యక్తులను టోల్ కట్టించుకోకుండా వదిలిపెట్టడమే కాకుండా, క్యూలైన్లలో చాలా సమయం వేచి ఉండే సామాన్య ప్రజలతో సైతం దురుసుగా ప్రవర్తిస్తారనే ఫిర్యాదులు ఉన్నాయి. కొన్నిసార్లు చెల్లించే టోల్ పై కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. సాధారణంగా సైరన్ తో వచ్చే వాహనాలను టోల్ గేట్ వద్ద అడ్డుకోరు, ఈరోజు ఘటనలో దేవళ్ల రేవతి వాహనం కూడా సైరన్ మోగుతుండటం గమనార్హం. ఏదైమైనా NHAI ఉన్నతాధికారులు టోల్ ప్లాజా వద్ద వాహనదారులతో అనుసరించాల్సిన విధానంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.