Actress Jayanthi Passes Away: ప్రముఖ సినీ నటి జయంతి కన్నుమూత, సంతాపం తెలిపిన కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్పతో సహా పలువురు ప్రముఖులు, 500కు పైగా చిత్రాల్లో నటించిన జయంతి

Jayanthi (Photo credit: Twitter)

ప్రముఖ సినీ నటి జయంతి (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తెల్లవారుజామున బనశంకరిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1963లో కన్నడలో 'జెనుగూడు' చిత్రంతో సినీ ప్రవేశం చేసిన జయంతి..తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు. ఇప్పటివరకు సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, ఎంజీ రామచంద్రన్‌ వంటి ప్రముఖులతో నటించారు.

మోహన్ బాబు నటించిన పెదరాయుడు చిత్రంలో నటనకు గాను తెలుగులోనూ జయంతికి మంచి గుర్తింపు వచ్చింది. వీటితో పాటు జస్టిస్‌ చౌదరి, కొండవీటి సింహం, శాంతి నివాసం, బొబ్బిలియుద్ధం వంటి చిత్రాల్లోనూ విభిన్న పాత్రలతో మెప్పించారు. జయంతి హఠాన్మరణంతో కన్నడ నాట విషాద ఛాయలు అలుముకున్నాయి. జయంతి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.