ICC Women's World Cup 2022: ఐసీసీ కీలక నిర్ణయం, 9 మంది ఆటగాళ్లతో క్రికెట్ ఆడవచ్చు, మెగా టోర్నీ స‌జావుగా సాగాల‌నే ఉద్దేశంతో నిబంధనల్లో మార్పు

కరోనా నేప‌థ్యంలో మెగా టోర్నీ స‌జావుగా సాగాల‌నే ఉద్దేశంతో నిబంధనలు మార్చాల‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ నిర్ణ‌యించింది.

ICC Women’s Cricket World Cup 2022 logo

న్యూజీలాండ్ లో మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న మహిళల వ‌న్డే ప్రపంచ కప్ 2022కి సంబంధించి ఐసీసీ కీల‌క నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. కరోనా నేప‌థ్యంలో మెగా టోర్నీ స‌జావుగా సాగాల‌నే ఉద్దేశంతో నిబంధనలు మార్చాల‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ నిర్ణ‌యించింది. ఏదైనా జ‌ట్టులో కరోనా వ్యాప్తి చెందితే, కనీసం 9 మంది ఆటగాళ్లతో బ‌రిలోకి దిగేందుకు ఐసీసీ అనుమ‌తిచ్చింది. అలాగే ప్లేయ‌ర్స్‌ను బ‌యో బ‌బుల్స్‌లో ఉంచ‌డం, బంతి బౌండరీ లైన్‌ దాటి వెలుపలకు వెళ్లినప్పుడు శానిటైజ్ చేయ‌డం, ఓ ప్లేయ‌ర్ క‌రోనా బారిన ప‌డితే జ‌ట్టులో ప్ర‌తి ప్లేయ‌ర్‌కు కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వంటి నిబంధనలను య‌ధాత‌థంగా కొన‌సాగుతాయ‌ని ఐసీసీ ప్ర‌క‌టించింది.

ఇటీవల ముగిసిన‌ అండర్-19 ప్రపంచ కప్‌లో టీమిండియా సహా ప‌లు జ‌ట్లలో కరోనా కేసులు నమోదై, క‌నీసం 11 మంది ఆట‌గాళ్ల‌ను బ‌రిలోకి దించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఓ జ‌ట్టైతే ఆట‌గాళ్లు అందుబాటులో లేక టోర్నీలో నుంచే వైదొలిగింది. ఈ నేప‌థ్యంలో ఐసీసీ నిబంధ‌న‌లను స‌వ‌రించింది.