ICC Women’s World Cup 2022: ప్రపంచకప్ ఆశలు ఆవిరి..దక్షిణాఫ్రికా చేతిలో పోరాడి ఓడిన భారత మహిళల క్రికెట్ టీం, ఓటమితో ఐదో స్థానంతో వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమణ

సెమీస్‌ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో (ICC Women’s World Cup 2022) గత రన్నరప్‌ టీమిండియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.

India Fail To Qualify for ICC Women’s World Cup 2022 Semifinals

భారత మహిళల వరల్డ్‌కప్‌ కల మరోసారి భగ్నమైంది. సెమీస్‌ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో (ICC Women’s World Cup 2022) గత రన్నరప్‌ టీమిండియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (71), షఫాలీ వర్మ (53), మిథాలీ రాజ్‌ (68) అర్ధ శతకాలతో రాణించారు. ఛేదనలో దక్షిణాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 275/7 స్కోరు చేసి నెగ్గింది. లారా ఉల్వెర్డ్‌ (80), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ మిగ్నాన్‌ డు ప్రీజ్‌ (52) సఫారీల గెలుపులో కీలకపాత్ర పోషించారు. వెన్ను నొప్పి కారణంగా జులన్‌ గోస్వామి ఈ మ్యాచ్‌కు (ICC Women’s World Cup 2022) దూరమైంది. ఈ ఓటమితో 7 మ్యాచ్‌ల నుంచి మొత్తం 6 పాయింట్లు సాధించిన భారత్‌.. ఐదో స్థానంతో ఇంటిముఖం పట్టింది.

ఆఖరి ఓవర్‌లో ప్రొటీస్‌ విజయానికి 7 పరుగులు అవసరమవగా.. దీప్తి తొలి నాలుగు బంతుల్లో 4 రన్స్‌ మాత్రమే ఇచ్చింది. త్రిష (7) రనౌట్‌ అయింది. ఇక చివరి రెండు బంతుల్లో 3 పరుగులు కావాల్సి ఉండగా.. ఐదో బంతికి డు ప్రీజ్‌ క్యాచ్‌ అవుట్‌ అయింది. కానీ, దీప్తి ఓవర్‌స్టెప్‌ అయిందంటూ అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించడంతో టీమిండియా ఆనందం ఆవిరైంది. ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు సింగిల్స్‌తో సౌతాఫ్రికా గెలిచింది.