Aditi Ashok: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి అదితి అశోక్ సంచలనం, గోల్ఫ్‌లో పతకం చేజారినా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న గోల్ఫ‌ర్, అదితిపై ప్రశంసల వర్షం కురిపించిన రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖులు

కానీ 23 ఏళ్ల అదితి ఇప్పుడు భారతీయులందరికీ సుపరిచితమైపోయింది. వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో ఆమె (Aditi Ashok At Tokyo Olympics 2020) చూపించిన తెగువ ఇప్పుడు అందర్నీ ఆమె వైపు తిప్పుకునేలా చేసింది.

Aditi Ashok (Photo Credits: Twitter)

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించారు. వీరిలో కొందరు పతకాలతో మెరవగా మరికొందరు పతకాలు సాధించకపోయినా తమ అద్భుతమైన ఆటతీరుతో దేశ ప్రజల మనసును గెలుచుకున్నారు. వీరిలో అదితి అశోక్ ఒకరు. నిజానికి అదితి అశోక్‌ (Aditi Ashok) అంటే దేశంలో 90% జనాభాకు తెలియనే తెలియదు. గోల్ఫ్‌లో ఇద్దరమ్మాయిలు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతే చాలామందికి తెలియదు. కానీ 23 ఏళ్ల అదితి ఇప్పుడు భారతీయులందరికీ సుపరిచితమైపోయింది. వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో ఆమె (Aditi Ashok At Tokyo Olympics 2020) చూపించిన తెగువ ఇప్పుడు అందర్నీ ఆమె వైపు తిప్పుకునేలా చేసింది.

టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే నాటికి అదితి ర్యాంకు 200. అలాంటిది ప్రపంచ నంబర్‌ వన్‌ సహా టాప్‌-10లోని క్రీడాకారిణులకు ఆమె భారీ షాకులిచ్చింది. అంచనాలను తలదన్ని నాలుగో స్థానంలో నిలిచింది. ఎవరూ ఉహించని గోల్ఫ్‌లో పతకంపై ఆశలు రేపింది. నిజానికి ఆమె గెలిచినంత పనిచేసింది.అయితే దురదృష్టవశాత్తూ పతకానికి అడుగుదూరంలో నిలిచిపోయింది. అదితి అశోక్‌ కేవలం ఒకే ఒక్క స్ట్రోక్‌తో పతకం చేజార్చుకుంది.

వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో (Aditi Ashok At Olympics) మూడో రౌండ్‌ ముగిసే సరికి అదితి 201 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నాలుగో రౌండ్లో అదే ప్రదర్శన పునరావృతం చేస్తే ఆమె చరిత్ర సృష్టించేదే. శనివారం ఆమె ఏదో ఒక పతకం సాధిస్తుందనే అంతా అనుకున్నారు. నేడు తుపాను హెచ్చరికలతో ఆట నిలిపేసే సమయానికి లిడియా కో (కివీస్‌)తో కలిసి అదితి ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచింది. అప్పటికి మరో రెండు హోల్స్‌ మాత్రమే మిగిలున్నాయి.

దూసుకొస్తున్న మిరినే ఉష్ణమండల తుఫాను, టోక్యో ఒలింపిక్స్‌‌కు అంతరాయం ఏర్పడే అవకాశం, రుక్యు దీవుల దగ్గర మిరినే పుట్టే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ

తుపాను ప్రభావం ఇలాగే ఉండి ఆట జరగదనే అంతా భావించారు! అలా జరిగితే మూడో రౌండ్‌ వరకే లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అలాంటప్పుడు అదితికి రజతం వస్తుందని అనుకున్నారు. కానీ వర్షం, ఉరుములు, మెరుపులు, గాలి దుమారం ఆగిపోవడంతో ఆట మళ్లీ మొదలైంది. నాలుగో రౌండ్లో అదితి ఐదు బర్డీస్‌ సాధించింది. 5, 6, 8, 13, 14 హోల్స్‌ను నిర్దేశిత స్ట్రోక్స్‌ కన్నా ముందే పూర్తి చేసింది. 9, 11వ హోల్స్‌కు మాత్రం బోగీస్‌ ఎదురయ్యాయి.

అంటే నిర్దేశిత స్ట్రోక్స్‌ కన్నా ఎక్కువ తీసుకుంది. నాలుగో రౌండ్లో ఆమె 3 అండర్‌ 68 సాధించగా కాంస్యం గెలిచిన లిడియా కో 6 అండర్‌ 65తో నిలిచింది. అంటే ఆటను 71 స్ట్రోక్స్‌లో ముగించే బదులు 6 తక్కువ స్ట్రోక్స్‌తో ముగించింది. దాంతో మొత్తంగా అదితి 15 అండర్‌ 269 సాధించగా లిడియా 16 అండర్‌ 268 సాధించింది. కేవలం ఒకే ఒక్క స్ట్రోక్‌.. ఒకే ఒక్క బర్డీ అదితికి కలిసొచ్చి ఉంటే ఆమె దేశం తరపున సరికొత్త చరిత్ర సృష్టించేది.

Here's PM and President Tweets

అదితి రియో ఒలింపిక్స్‌లో ఉమ్మడిగా 41వ స్థానంలో నిలిచింది. కానీ టోక్యోలో ఏకంగా నాలుగో స్థానానికి మెరుగైంది. దీంతో సంప్రదాయ క్రీడల్లోనే కాదు భారతదేశం సరికొత్త, వినూత్నమైన ఆటల్లోనూ రాణించగలదని నిరూపించింది. ఆరేళ్ల వ‌య‌సులోనే గోల్ఫ్ ఆట‌కు ఆక‌ర్షితురాలైన బెంగుళూరుకు చెందిన ఆదితి 2017లో లేడీస్ ప్రొఫెష‌న‌ల్ గోల్ఫ్ అసోసియేష‌న్ ప్లేయ‌ర్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ ఏడాది లూయిస్ స‌గ్స్ రూకీ ర్యాంకింగ్స్‌లో ఆమె 8వ స్థానంలో నిలిచింది. 2016లో రియోలో జ‌రిగిన మ‌హాక్రీడ‌ల‌కు ఎంపికైన యువ క్రీడాకారిణిగా కూడా రికార్డు సృష్టించింది. 18 ఏళ్ల, నాలుగు నెల‌ల వ‌య‌సులోనే ఆమె ఒలింపిక్స్‌కు ఎంట్రీ ఇచ్చింది. రియోలో ఒంట‌రిగా మ‌హిళ‌ల ఈవెంట్‌లో దేశం త‌ర‌పున‌ పోటీ చేసింది. ఈసారి టోక్యోలో మాత్రం అదితితో పాటు మ‌రో గోల్ఫ‌ర్ దీక్షా సాగ‌ర్ కూడా రంగంలోకి దిగింది.

టోక్యోలో కరోనా కల్లోలం, అత్యధికంగా ఒక్కరోజే 2,848 కేసులు నమోదు, ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత జపాన్ రాజధానిలో పంజా విప్పిన కోవిడ్, ఆందోళనకరంగా మారిన డెల్టా వేరియంట్

12 ఏళ్ల వ‌య‌సులోనే గోల్ఫ‌ర్ అదితి.. ఆసియా ప‌సిఫిక్ ఇన్విటేష‌న‌ల్ టోర్నీలో పాల్గొన్న‌ది. నిజానికి ఆ టోర్నీ ఆడేందుకు స‌గ‌టును 18 నుంచి 22 ఏళ్ల వ‌య‌సు ఉండాలి. ఇక 13 ఏళ్ల‌కే భార‌త్‌లో జ‌రిగిన తొలి ప్రొఫెష‌న‌ల్ టూర్‌లో ఆమె విజ‌యం సాధించింది. గోల్ఫ్‌లో సంచ‌ల‌నంగా మారిన అదితి.. వ‌రుస‌గా మూడుసార్లు జాతీయ జూనియ‌ర్ చాంపియ‌న్‌గా నిలిచింది. 2012 నుంచి 2014 వ‌ర‌కు ఆమె చాంపియ‌న్‌గా ఆవిర్భ‌వించింది. 2011, 2014లో అదితి అశోక్‌.. రెండు సార్లు నేష‌న‌ల్ అమెచ్యూర్ చాంపియ‌న్‌గా రికార్డు సృష్టించింది. ఇక 2013లో ఏషియ‌న్ యూత్ గేమ్స్‌లో ప్రాతినిధ్యం వ‌హించిన ఏకైన భార‌తీయ గోల్ఫ‌ర్ ఈమె. 2014లో యూత్ ఒలింపిక్ గేమ్స్‌, అదే ఏడాది ఏషియ‌న్ గేమ్స్‌లోనూ పాల్గొన్న‌ది.

టోక్యో ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్నప్పటికీ అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ గోల్ఫర్‌ అదితి అశోక్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందించారు. గోల్ఫ్‌లో భారత్‌ను సరికొత్త శిఖరాలను చేర్చావంటూ కొనియాడారు.

* టోక్యో ఒలింపిక్స్‌లో మరో భారత పుత్రిక తనదైన ముద్ర వేసింది. అదితి అశోక్‌ నువ్వు గొప్ప ప్రదర్శన చేశావు. ఈ రోజు నీ చరిత్రాత్మక ప్రదర్శనతో భారత గోల్ఫింగ్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లావు. అద్భుతమైన నైపుణ్యంతో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన నీకు అభినందనలు - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌

* బాగా ఆడావు అదితి. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించావు. పతకం తృటిలో తప్పిపోయి ఉండొచ్చు కానీ ఈ ఆటలో ఏ భారతీయుడు చేరుకోలేనంత దూరం వెళ్లావు. ఆ దారిలో మెరిశావు. నీ భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా - ప్రధాని మోదీ

* ఒలింపిక్‌ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత తొలి మహిళా గోల్ఫర్‌. టోక్యోలో అద్భుత ప్రదర్శన చేసిన అదితి అశోక్‌కు స్టాండింగ్ ఒవేషన్‌ దక్కుతుంది. చివరి వరకు ఎంతో గొప్పగా ఆడావు. చరిత్ర సృష్టించావు - క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

* గోల్ఫ్‌ కోటపైకి దూసుకెళ్లి బారత్‌ను కొత్తగా చూపించింది. ఈ ఆట భవిష్యత్తుపై దృష్టిపెట్టేలా మాపై ఒత్తిడి పెంచినందుకు కృతజ్ఞతలు - ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా

* అదితి అశోక్‌.. నువ్వు తృటిలో పతకం కోల్పోయినప్పటికీ టోక్యోలో నాలుగో స్థానంలో నిలిచావు. నీ విజయం పట్ల మేమంతా గర్విస్తున్నాం. నీ ప్రయాణం మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా - కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు