Australia: ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు షాకిచ్చిన ఆస్ట్రేలియా, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన,అక్కడ మహిళల హక్కులు కాలరాస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం

2023 మార్చిలో యూఏఈ వేదికగా ఆప్ఘనిస్తాన్‌తో జరగాల్సిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను (ODI series ) రద్దు చేసుకుంటున్నట్లు సీఏ ప్రకటించింది.

australia-win-by-42-runs-against-ireland-in-t20-worldcup (Photo-Twitter)

ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) భారీ షాకిచ్చింది. 2023 మార్చిలో యూఏఈ వేదికగా ఆప్ఘనిస్తాన్‌తో జరగాల్సిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను (ODI series ) రద్దు చేసుకుంటున్నట్లు సీఏ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో (Afghanistan) తాలిబన్ ప్రభుత్వం మహిళలు, అమ్మాయిల ప్రాధమిక హక్కులను కాలరాస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఏ (Australia Cricket) వెల్లడించింది.

2021 సెప్టెంబర్‌లో తాలిబన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు, అమ్మాయిలకు విద్య, ఉపాధి దూరం చేయడంతో పాటు క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించిందని, దీన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో పరోక్షంగా కూడా సమర్ధించేది లేదని పేర్కొంది. పురుషులతో సమానంగా మహిళల క్రికెట్‌ వ్యాప్తికి సీఏ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల క్రికెట్‌పై అంక్షలను సహించేది లేదని తెలిపిం‍ది.

రోహిత్ శర్మని చూసి ఏడ్చేసిన చిన్నారి, దగ్గరకు వెళ్లి బుగ్గ గిల్లి ఓదార్చిన రోహిత్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమకు పూర్తి మద్దతు ప్రకటించిందని వివరించింది. తాలిబన్‌ ప్రభుత్వం మహిళలు, అమ్మాయిలపై అంక్షలు ఎత్తి వేస్తే వారితో సత్సంబంధాలు కొనసాగించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని అంది. కాగా, క్రికెట్‌ ఆస్ట్రేలియా.. ఆఫ్ఘనిస్తాన్‌ విషయంలో ఇలా వ్యవహరించడం ఇది తొలిసారి కాదు. గతంలో హోబర్ట్‌లో జరగాల్సిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ను ఇదే కారణంగా చూపి రద్దు చేసింది.