Chetan Sakariya: రూ. 20 లక్షల నుంచి రూ.1.20 కోట్లకు, నా విజయాన్ని చూసేందుకు తమ్ముడు బతికిలేడు, ఉద్యేగానికి లోనైన చేతన్ సకారియా, ఐపీఎల్-2021 మినీ వేలంలో ఈ ఆటగాడిని కొనుగోలు చేసిన రాజస్తాన్ రాయల్స్
రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన 22 ఏళ్ల ఈ సౌరాష్ట్ర ఫాస్ట్‌బౌలర్ పై ఆర్సీబీ ఆసక్తి కనపరచినప్పటికీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చేజిక్కించుకుంది.
చెన్నైలో జరిగిన ఐపీఎల్-2021 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ చేతన్ సకారియాను (Chetan Sakariya) రూ.1.20 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి విదితమే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన 22 ఏళ్ల ఈ సౌరాష్ట్ర ఫాస్ట్‌బౌలర్ పై ఆర్సీబీ ఆసక్తి కనపరచినప్పటికీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చేజిక్కించుకుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన చేతన్‌కు ఒక్కసారిగా భారీ మొత్తం దక్కడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. ఈ సంధర్భంగా సకారియా తన గతాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
మా నాన్న టెంపో నడుపుతారు. ఆయన సంపాదనతోనే మమ్మల్ని పోషించారు. గత నెలలో నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నేను ఇంట్లో లేను. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఆడుతున్నాడు. మ్యాచ్ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాతే నా తమ్ముడు ఇక లేడనే విషయం తెలిసింది. అప్పుడు కూడా నా కుటుంబ సభ్యులు తమకు తాముగా ఈ విషయం బయటపెట్టలేదు. రాహుల్ ఎక్కడున్నాడు అని ఎన్నోసార్లు అడిగాను. ప్రతీసారి బయటకు వెళ్లాడు తొందరగానే వస్తాడు అని చెప్పేవారు. కానీ ఒకానొకరోజు నిజం చెప్పక తప్పలేదు. నా తమ్ముడు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఈ రోజు వాడు బతికి ఉంటే నా కంటే ఎక్కువ తనే సంతోషించేవాడు. కానీ తను శాశ్వతంగా దూరమయ్యాడు’’అంటూ యువ క్రికెటర్ చేతన్ సకారియా భావోద్వేగానికి లోనయ్యాడు. తన తమ్ముడిని తలచుకుని ఉద్వేగానికి గురయ్యాడు.
ఇక ఇప్పుడు మా నాన్నకు కాస్త విశ్రాంతినివ్వాలని భావిస్తున్నా. కుటుంబ బాధ్యతను తీసుకుంటానని చెప్పాను. ఇంత పెద్ద మొత్తంతో ఏం చేస్తావని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ముందైతే డబ్బు చేతికి రానివ్వండి. రాజ్‌కోట్‌కు షిఫ్ట్ అయిపోతాం. అక్కడే ఒక మంచి ప్రదేశంలో ఓ ఇల్లు కొనుగోలు చేయాలనకుంటున్నా అని చెప్పాను’’ అంటూ తన కలల గురించి చెప్పుకొచ్చాడు. కాగా మినీ వేలంలో రాజస్తాన్ రాయల్స్ రికార్డు ధరకు(రూ. 16.25 కోట్లు) దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్, శివం దూబేను రూ. 4.40 కోట్లు, ముస్తాఫిజుర్ రహమాన్‌ను రూ. కోటికి కొనుగోలు చేసింది. ఇక సకారియాను 1.20 కోట్లు వెచ్చించి సొంతం చేసుకోగా, ఆర్‌ఆర్ అత్యధిక ధరకు కొన్న ఆటగాళ్లలో అతడు మూడో స్థానంలో నిలిచాడు.