Coronavirus Scare: టీమిండియా ఏ జట్టులో కరోనా కలకలం, దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇద్దరు కోచ్‌లకు పాజిటివ్ అంటూ వార్తలు, రెండోసారి కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత-ఏ జట్టు కోచింగ్‌ సిబ్బందిలో ఇద్దరికి కరోనా (Coronavirus Scare) పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వార్తలు రావడంతో భారత శిబిరంలోని ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

india-a-vs-south-africa-a (Photo-BCCI/Twitter)

టీం ఇండియా ఏ జట్టులో కరోనా కలకలం రేగింది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత-ఏ జట్టు కోచింగ్‌ సిబ్బందిలో ఇద్దరికి కరోనా (Coronavirus Scare) పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వార్తలు రావడంతో భారత శిబిరంలోని ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సిన టీమిండియా సైతం ఈ వార్త విని తీవ్ర ఆందోళనకు గురైంది. అయితే, ఆ ఇద్దరు కోచింగ్‌ సిబ్బందికి రెండోసారి కోవిడ్‌ పరీక్ష నిర్వహించగా, అందులో నెగిటివ్‌ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఆందోళన రేపిన ఘటన వివరాల్లోకి వెళితే.. బ్లూంఫాంటేన్‌ వేదికగా భారత-ఏ, దక్షిణాఫ్రికా ఏ జట్ల మధ్య జరుగుతున్న చివరి నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో తొలుత ఇద్దరు టీమిండియా కోచ్‌లకు (two India A coaches) కోవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ పాజిటివ్‌గా తేలింది, రెండోసారి జరిపిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు ఓ ప్రముఖ దినపత్రిక పేర్కొంది. ప్రాధమిక పరీక్ష ఫలితాలు తప్పు (false positives cases) అని క్రికెట్ దక్షిణాఫ్రికా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నిర్ధారించినట్లు సదరు పత్రిక తెలిపింది.

విరాట్ కోహ్లీని అందుకే సాగనంపారు, సంచలన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ సాబా కరీం, రోహిత్‌ని పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా నియమించిన బీసీసీఐ

భారత బృంద సభ్యులందరికీ నెగిటివ్‌ రావడంతో మ్యాచ్‌ను యధాతథంగా కొనసాగిస్తున్నారు. ఫాల్స్‌ పాజిటివ్‌ వచ్చిన ఇద్దరు కోచ్‌లను క్వారంటైన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. కాగా, భారత-ఏ బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే, బ్యాటింగ్‌ కోచ్‌గా సితాన్షు కోటక్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా శుభ్‌దీప్ ఘోష్‌లను బీసీసీఐ దక్షిణాఫ్రికాకు పంపింది.

కోవిడ్ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రకంపనల కారణంగా భారత సీనియర్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన వారం ఆలస్యంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో తొలి టెస్ట్‌ డిసెంబర్ 26న, రెండో టెస్టు వచ్చే ఏడాది జనవరి 3న, సిరీస్‌లో ఆఖరుదైన మూడో టెస్ట్‌ జనవరి 11న జరగనున్నాయి. అనంతరం వన్డే, టీ20 సిరీస్‌లు ప్రారంభమవుతాయి.