ICC T20 World Cup 2020: ఈ ఏడాది జరగాల్సిన టీ20 క్రికెట్ ప్రపంచ కప్ వాయిదా, అధికారికంగా ప్రకటించిన ఐసీసీ, ఐపీఎల్ 2020 నిర్వహణకు లైన్ క్లియర్
ఐపీఎల్ వేదికకు తొలి ప్రాధాన్యం...
ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 క్రికెట్ ప్రపంచ కప్ వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్19 విజృంభిస్తున్న వేళ ఈ మెగా ఈవెంట్ నిర్వహణపై కొన్ని వారాలుగా విస్తృత చర్చలు జరుపుతూ వచ్చిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎట్టకేలకు సోమవారం రోజు జరిగిన తన బోర్డ్ సమావేశం అనంతరం ప్రపంచకప్ టోర్నమెంట్ వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. క్రికెటర్ల ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఐసీసీ పేర్కొంది.
వాస్తవానికి టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 19 నుండి నవంబర్ 15 వరకు జరగాల్సి ఉంది. అయితే తమ దేశంలో కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది తాము ప్రపంచకప్ టోర్నమెంటుకు ఆతిథ్యం ఇవ్వలేకపోవచ్చునని క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగానే ఐసీసీకి సూచించింది. ఈ క్రమంలో టోర్నమెంట్ వేదికను మార్చడం, ఇతర ప్రత్నామ్నాయ మార్గాలపై అణ్వేషిస్తూ వచ్చిన ఐసీసీ చివరకు వాయిదా వైపే మొగ్గు చూపింది.
ఇక, ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా వేయడంతో ఐపీఎల్ 2020కి మార్గం సుగమం అయింది. ముందునుంచీ ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ నిర్వహించి తీరుతామని పట్టుదలతో ఉన్న బీసీసీఐ మొన్న శుక్రవారం జరిగిన బోర్డ్ మీటింగ్ లో కొవిడ్ తీవ్రత తక్కువగా ఉన్న యూఎఈలో ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ మధ్య కాలంలో ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది.
అయితే, అదే సమయంలో ఐసీసీ ప్రపంచకప్ షెడ్యూల్ చేయబడి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ పై కొంత అస్పష్టత నెలకొని ఉంది, ప్రస్తుతం ప్రపంచకప్ వాయిదా పడటంతో బీసీసీఐ ముందు ఉన్న ఒక అడ్డు తొలగిపోయినట్లయింది. ఐపీఎల్ వేదికకు తొలి ప్రాధాన్యం ఇండియానే అయినా, దేశంలో పరిస్థితుల్లో మార్పు రాకపోతే దుబాయ్ లో నిర్వహించేందుకు బీసీసీఐ మరియు ఐపీఎల్ ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం టోర్నీ నిర్వహణ కోసం భారత ప్రభుత్వం అనుమతులు పొందేందుకు బీసీసీఐ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరో వారంలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.