Mumbai, July 18: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) యొక్క 13 వ ఎడిషన్ యూఎఈ లో నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. నిన్న జరిగిన బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్ మార్చి 29 మరియు మే 17 మధ్య జరగాల్సి ఉంది, కానీ దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టోర్నమెంట్ నిర్వహణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
ఐపీఎల్ 2020 టోర్నమెంట్ నిర్వహించడం తమ ప్రథమ ప్రాధాన్యత అని ఇప్పటికే బిసిసిఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిసిసిఐ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీ ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ 2020 నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు. భారతదేశంలో నిర్వహణ సాధ్యం కాకపోతే విదేశాల్లోనైనా నిర్వహించాలని ఆయన దృఢ నిశ్చయం కలిగి ఉన్నారు.
ఈ క్రమంలో ప్రపంచంలో కొవిడ్ తీవ్రత తక్కువగా ఉన్న యూఎఈ టోర్నమెంట్ నిర్వహణకు అత్యంత సురక్షితమైన ప్రదేశంగా బిసిసిఐ నిర్ధారణకు వచ్చింది. అందుకనుగుణంగానే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో చర్చించి, ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ మధ్య కాలంలో నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది.
అయితే విదేశాల్లో టోర్నమెంట్ నిర్వహణకు భారత ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి, ఇప్పటికే బిసిసిఐ యూఎఈలో ఐపీఎల్ 2020 నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు దాని ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం భారత ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడం. అందుకు సంబంధించి బోర్డ్ పెద్దలు ఇప్పటికే ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తాం, టోర్నీ ఎలా నిర్వహించే విధానం తదితర అంశాలతో ప్రెజెంటేషన్ సిద్ధం చేసింది. మరి భారత ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని క్రికెట్ అభిమానుల్లో ఆత్రుత నెలకొని ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణకు అనుమతిని ఇస్తుందా, లేదా వేచి చూడాలి.
ఇదిలా ఉంటే, ఐసిసి బోర్డు సమావేశం కూడా సోమవారం జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో ఈ ఏడాది జరగాల్సిన ట 20 ప్రపంచ కప్ గురించి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.