India Vs England: వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా విజ‌య యాత్ర‌, ఇంగ్లాండ్ పై 100 తేడాతో ఘనవిజయం, భారత్ సెమీస్ బెర్త్ ఖాయం

ప్రపంచకప్‌లో (World Cup) సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. రోహిత్‌ సేన నిర్దేశించిన 230 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్‌.. 34.5 ఓవర్లలో 129 కే ఆలౌట్‌ అయింది. ఫలితంగా భారత్‌.. వంద పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

India Vs England (PIC@ ICC X)

Lucknow, OCT 29: వన్డే ప్రపంచకప్‌లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో తడబడ్డా భారత (India win) బౌలర్ల విజృంభణతో ఈ మెగా టోర్నీలో భారత్‌ ఆరో విజయాన్ని నమోదుచేసింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కాస్త తడబడ్డా మన బౌలర్ల సమిష్టి కృషితో భారత్‌.. ప్రపంచకప్‌లో (World Cup) సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. రోహిత్‌ సేన నిర్దేశించిన 230 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్‌.. 34.5 ఓవర్లలో 129 కే ఆలౌట్‌ అయింది. ఫలితంగా భారత్‌.. వంద పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో తిరిగి అగ్రస్థానానికి చేరుకోగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ అధికారికంగా సెమీస్‌ (Semi Final) రేసు నుంచి తప్పుకుంది. లక్నో పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తుందని భారత్ బ్యాటింగ్‌తో క్లారిటీ వచ్చినా స్వల్ప ఛేదనే కావున ఇంగ్లండ్‌ ఆ దిశగా సాగుతుందేమోననిపించింది. కానీ భారత పేస్‌ ధ్వయం జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీలు ఇంగ్లండ్‌కు ఆ ఆలోచనను ఆదిలోనే తుంచేశారు.

 

ఇన్నింగ్స్‌ ధాటిగా ఆరంభించేందుకు యత్నించిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ మలన్‌ (17 బంతుల్లో 16, 2 ఫోర్లు, 1 సిక్స్)ను ఔట్‌ చేసి బుమ్రా ఇంగ్లండ్‌ వికెట్ల పతనాన్ని మొదలుపెట్టాడు. బుమ్రా (Bumra) వేసిన ఐదో ఓవర్‌ ఐదో బంతికి మలన్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మరుసటి బంతికే జో రూట్‌ ఎల్బీగా నిష్క్రమించాడు. సిరాజ్‌ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో రోహిత్‌ (Rohit Sharma).. ఆరో ఓవర్లోనే షమీకి బంతినిచ్చాడు. షమీ వేసిన ఆరో ఓవర్లో బంతులను అడ్డుకునేందుకు తంటాలు పడ్డ స్టోక్స్‌ (0).. అతడే వేసిన 8వ ఓవర్లో ఆరో బంతికి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. పదో ఓవర్లో బుమ్రా.. బెయిర్‌ స్టో (23 బంతుల్లో 14, 2 ఫోర్లు) ను ఔట్‌ చేసి ఇంగ్లీష్‌ జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు.

 

భారత పేసర్ల విజృంభణతో ఆత్మరక్షణలోకి వెళ్లిన ఇంగ్లండ్‌.. డిఫెన్స్‌ను ఆశ్రయించింది. జోస్‌ బట్లర్‌ (23 బంతుల్లో 10, 1 ఫోర్‌) మోయిన్‌ అలీ (31 బంతుల్లో 15) వికెట్లు కాపాడుకునేందుకు తంటాలుపడ్డారు. దీంతో రోహిత్‌.. కుల్దీప్‌ యాదవ్‌ను రంగంలోకి దించాడు. కుల్దీప్‌ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికే బట్లర్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయి వెనుదిరిగాడు. 8 ఓవర్ల పాటు వికెట్‌ పడకుండా కాపాడిన మోయిన్‌ అలీనీ షమీ ఔట్‌ చేశాడు. సెకండ్‌ స్పెల్‌ లో బౌలింగ్‌ కు వచ్చిన షమీ.. 24వ ఓవర్లో తొలి బంతికి అలీని పెవిలియన్‌కు పంపాడు. అతడి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన క్రిస్‌ వోక్స్‌ (10) ను జడేజా బోల్తా కొట్టించాడు. గెలుపు మీద ఆశలు లేకున్నా ఇంగ్లండ్‌ను కాపాడతాడేమోనని భావించిన లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (46 బంతుల్లో 27, 2 ఫోర్లు) ను కుల్దీప్‌ ఎల్బీగా వెనక్కిపంపాడు.

టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్‌ పనిపట్టిన షమీ, బుమ్రాలు .. తోకను కూడా కత్తిరించారు. రెండు ఫోర్లు కొట్టిన అదిల్‌ రషీద్‌ (13)ను 34వ ఓవర్లో ఆఖరి బంతికి క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. డేవిడ్‌ విల్లే మెరుపులు మెరిపించినా అవి ఓటమి అంతరాన్ని తగ్గించాయే తప్ప ఇంగ్లండ్‌ను గెలిపించలేదు. ఆఖరికి మార్క్‌ వుడ్‌ (0)ను బుమ్రా బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ కథ ముగిసింది. భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌కు రెండు వికెట్లు దక్కాయి.