IND vs AUS 5th T20I: ఉత్కంఠ రేపిన ఐదో టీ-20లోనూ ఓటమి పాలైన ఆసిస్, చివరి ఓవర్ లో అర్ష్ దీప్ స్టన్నింగ్ బౌలింగ్,6 పరుగుల తేడాతో టీమిండియా విజయం
భారత్ నిర్దేశించిన 161 పరుగుల ఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేయడంతో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం (India Win) సాధించింది.
Bangalore, December 03: భారత్ – ఆసీస్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వేదికగా ముగిసిన ఐదో టీ20లో (IND Vs AUS) యువ భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 161 పరుగుల ఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేయడంతో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం (India Win) సాధించింది. ఆస్ట్రేలియా తరఫున బెన్ మెక్ డార్మట్ (36 బంతుల్లో 54, 5 సిక్సర్లు), మాథ్యూ వేడ్ (15 బంతుల్లో 22, 4 ఫోర్లు) పోరాడారు. ఈ విజయంతో సిరీస్‌ను భారత్ 3-2 తేడాతో గెలుచుకుంది. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీశాడు. ఆఖరి ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
స్వల్ప ఛేదనలో ఆసీస్‌కు మూడో ఓవర్లోనే తొలి షాక్ తాకింది. నాలుగు పరుగులే చేసిన జోష్ ఫిలిప్పి ని ముఖేష్ కుమార్ మూడో ఓవర్లోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన ట్రావిస్ హెడ్ (18 బంతుల్లో 28, 5 ఫోర్లు, 1సిక్సర్) ను రవి బిష్ణోయ్ ఔట్ చేశాడు. బిష్ణోయ్ వేసిన ఐదో ఓవర్లో ఐదో బంతికి హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఏడో ఓవర్లో బిష్ణోయ్.. ఆసీస్‌కు మరో షాకిచ్చాడు ఆ ఓవర్ ఏడో బంతికి ఆరోన్ హార్డీ (6) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టడిచేయడంతో ఆసీస్ పరుగుల వేగం తగ్గింది.
పది ఓవర్లలో ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. ముఖేష్ కుమార్ వేసిన 11వ ఓవర్లో రెండో బంతికి భారీ సిక్సర్ బాదిన టిమ్ డేవిడ్ (17)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. అతడు వేసిన 14వ ఓవర్లో రెండో బంతికి భారీ షాట్ ఆడబోయి అవేశ్ ఖాన్ చేతికి చిక్కాడు. 34 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్ల సాయంతో అర్థ సెంచరీ పూర్తి చేసిన బెన్ మెక్ డార్మట్.. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 15వ ఓవర్లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.
ఆఖరి ఐదు ఓవర్లలో ఆసీస్ విజయలక్ష్యం 45 పరుగులు ఉండగా అవేశ్ ఖాన్ (Avesh Khan) వేసిన 16వ ఓవర్లో 8 పరుగులే వచ్చాయి. ముకేశ్ కుమార్ వేసిన 17వ ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టిన మాథ్యూ షార్ట్ (16).. మూడో బంతికి గైక్వాడ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. మరుసటి బంతికే ముకేశ్.. డ్వార్షిస్‌ను బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్లో కూడా ఐదు పరుగులే వచ్చాయి. కానీ అవేశ్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో మాథ్యూ వేడ్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టడంతో సమీకరణాలు రెండు ఓవర్లలో 17 పరుగులకు మారింది. ముకేశ్ వేసిన 19వ ఓవర్లో ఏడు పరుగులే వచ్చాయి. ఆఖరి ఓవర్లో పది పరుగులు చేయాల్సి ఉండగా.. అర్ష్‌దీప్ తొలి రెండు బంతులకు పరుగులేమీ ఇవ్వలేదు. మూడో బంతికి వేడ్.. శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చాడు. నాలుగో బంతికి ఒక్క పరుగే రాగా తర్వాత రెండు బంతులకూ రెండు పరుగులే వచ్చాయి.