IND vs WI ODI Series: రోహిత్ సేన చేతిలో విండీస్ చిత్తు, 3-0 తేడాతో సిరీస్ కైవసం, అన్ని విభాగాల్లోనూ టీమిండియాదే పైచేయి..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి వన్డేలో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 96 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి వన్డేలో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 96 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు సరిగ్గా 50 ఓవర్లలో 265 పరుగులకి ఆలౌటైంది. టీమ్‌లో శ్రేయాస్ అయ్యర్ (80: 111 బంతుల్లో 9x4), రిషబ్ పంత్ (56: 54 బంతుల్లో 6x4, 1x6) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. వెస్టిండీస్ జట్టులో జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. హెడెన్ వాల్ష్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు, ఓడెన్ స్మిత్, ఫాబియెన్ అలెన్‌కి ఒక్కో వికెట్ దక్కింది.
అనంతరం 266 పరుగుల ఛేదనలో వెస్టిండీస్ జట్టు చేతులెత్తేసింది. భారత బౌలర్లు దీపక్ చాహర్ (2/41), మహ్మద్ సిరాజ్ (3/29), ప్రసీద్ (3/27), కుల్దీప్ యాదవ్ (2/51) దెబ్బకి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఛేదనలో వెస్టిండీస్ చివరికి 37.1 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటైంది.
మూడు వన్డేల ఈ సిరీస్‌లో వెస్టిండీస్ కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా పూర్తిగా 50 ఓవర్లు ఆడలేదు. విండీస్ ఒక మ్యాచ్‌లో కూడా 200 పరుగుల మార్క్‌ని టచ్ చేయలేకపోయింది. 80 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయాస్ అయ్యర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.