India vs Australia World Cup 2023 Final: నేడే ఫైనల్ ఫైట్.. భారత్ x ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ తుది సమరంపై సర్వత్రా ఆసక్తి.. మూడుపై భారత్ గురి సిక్సర్ పై ఆసీస్ నజర్
మరికొన్ని గంటల్లో విశ్వ విజేతను తేల్చే సమరానికి తెరలేవనుంది. పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ లో ట్రోఫీని ముద్దాడేందుకు టీమ్ ఇండియా ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
Newdelhi, Nov 19: నెల రోజులకు పైగా క్రీడాభిమానులను ఊర్రూతలూగించిన వన్డే ప్రపంచ కప్ (World Cup) చివరి అంకానికి వచ్చేసింది. మరికొన్ని గంటల్లో విశ్వ విజేతను తేల్చే సమరానికి తెరలేవనుంది. పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ లో ట్రోఫీని ముద్దాడేందుకు టీమ్ ఇండియా (Team India) ఒక్క అడుగు దూరంలో నిలిచింది. టోర్నీ ఆసాంతం ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ సేన (Rohith Sena) ఆదివారం అహ్మదాబాద్ లోని ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో జరుగనున్న వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటి వరకు అత్యధికంగా ఆసీస్ ఐదుసార్లు ప్రపంచకప్ నెగ్గితే.. భారత్ రెండు సార్లు ట్రోఫీని ముద్దాడింది. మరి ఈ సారి టీమ్ ఇండియా హ్యాట్రిక్ కొడుతుందా.. లేక ఆసీస్ సిక్సర్ దంచుతుందా చూడాలి. ఈ మెగాటోర్నీలో ఆడిన పది మ్యాచ్ ల్లోనూ భారత్ కు పరాజయం అన్నదే ఎదురుకాకపోగా.. టోర్నీ ఆరంభంలో రెండు మ్యాచ్ లు ఓడిన తర్వాత ఆసీస్ పడి లేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసి వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు నెగ్గింది.
పిచ్, వాతావరణం
నెల రోజుల క్రితం భారత్, పాకిస్థాన్ మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌కు వాడిన పిచ్‌పైనే ఫైనల్ జరగనుంది. క్రీజులో నిలదొక్కుకుంటే భారీ స్కోరు సాధ్యమే. వాతావరణం చల్లగా ఉండనుంది. మ్యాచ్‌కు వర్ష సూచనలేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, సూర్య, జడేజా, షమీ, బుమ్రా, కుల్దీప్, సిరాజ్.
ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, హెడ్, మార్ష్, స్మిత్, లబుషేన్, మ్యాక్స్‌వెల్, ఇంగ్లిస్, స్టార్క్, హజిల్‌వుడ్, జాంపా.
ప్రైజ్ మనీ
- విజేత : రూ . 33 కోట్లు
- రన్నరప్ : రూ . 16 కోట్లు
మెగాటోర్నీలో ఇలా.. పరుగుల ధీరులు
- కోహ్లీ 711
- డికాక్ 594
- రచిన్ 578
- మిచెల్ 552
- రోహిత్‌శర్మ 550
వికెట్ల వీరులు
- షమీ 23
- జంపా 22
- మదుశనక 21
- కోట్జె 20
- అఫ్రీది 18