IPL Auction 2025 Live

India vs England, 5th T20I: భారత్ రికార్డుల మోత, ఎనిమిది సిరీస్‌ల తర్వాత తొలిసారి ఓటమిని చవి చూసిన ఇంగ్లండ్, ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో గెలుచుకున్న భారత్, అంతర్జాతీయ టీ20ల్లో టాప్-2లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ

శనివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను (India vs England, 5th T20I Match Result) ఓడించింది.

Indian bowlers restricted England to 188 to register a 36-run win. (Photo Credits: Twitter@BCCI)

Ahmedabad, March 20: ఇంగ్లండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 3–2తో గెలుచుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను (India vs England, 5th T20I Match Result) ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (52 బంతుల్లో 80 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఓపెనర్‌గా దిగిన కోహ్లి ముగ్గురు సహచరులతో వరుసగా 94, 49, 81 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం.

అనంతరం ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. డేవిడ్‌ మలాన్‌ (46 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (34 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 82 బంతుల్లోనే 130 పరుగులు జోడించినా జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. భారీ స్కోర్ల మ్యాచ్‌లో పొదుపైన బౌలింగ్‌తో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ భువనేశ్వర్‌ (2/15) జట్టును గెలిపించాడు. భారత కెప్టెన్‌ కోహ్లికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు లభించింది. పొట్టి ప్రపంచకప్‌నకు సన్నాహకంగా సాగిన ఈ సిరీస్‌లో భారత్‌కు కొత్త హీరోలు దొరకగా.. ఒత్తిడిని జయించడంలో విఫలమైన ఇంగ్లండ్‌ ఈ ఫార్మాట్‌లో ఎనిమిది సిరీస్‌ల తర్వాత తొలిసారి ఓటమి చవిచూసింది.

స్కోరు వివరాలు

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బి) స్టోక్స్‌ 64; కోహ్లి (నాటౌట్‌) 80; సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) రాయ్‌ (బి) రషీద్‌ 32; హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 224.

వికెట్ల పతనం: 1–94, 2–143.

బౌలింగ్‌: రషీద్‌ 4–0–31–1; ఆర్చర్‌ 4–0–43–0; వుడ్‌ 4–0–53–0; జోర్డాన్‌ 4–0–57–0; స్యామ్‌ కరన్‌ 1–0–11–0; స్టోక్స్‌ 3–0–26–1.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (బి) భువనేశ్వర్‌ 0; బట్లర్‌ (సి) హార్దిక్‌ (బి) భువనేశ్వర్‌ 52; మలాన్‌ (బి) శార్దుల్‌ 68; బెయిర్‌స్టో (సి) సూర్యకుమార్‌ (బి) శార్దుల్‌ 7; మోర్గాన్‌ (సి) (సబ్‌) కేఎల్‌ రాహుల్‌ (బి) హార్దిక్‌ 1; స్టోక్స్‌ (సి) పంత్‌ (బి) నటరాజన్‌ 14; జోర్డాన్‌ (సి) సూర్య (బి) శార్దుల్‌ 11; ఆర్చర్‌ (రనౌట్‌) 1; స్యామ్‌ కరన్‌ (నాటౌట్‌) 14; రషీద్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 20, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 188.

వికెట్ల పతనం: 1–0, 2–130, 3–140, 4–142, 5–142, 6–165, 7–168, 8–174.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–15–2; హార్దిక్‌ 4–0–34–1; సుందర్‌ 1–0–13–0; శార్దుల్‌ 4–0–45–3; నటరాజన్‌ 4–0–39–1; రాహుల్‌ చహర్‌ 3–0–33–0.

ఈ సిరీస్‌ (IND vs ENG 5th T20I 2021) విజయంతో టీమిండియా ఒక అరుదైన రికార్డు సాధించింది. 2016 టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌, భారత్‌ల మధ్య జరిగిన మూడు ద్వైపాక్షిక టీ20 టోర్నీల్లో మూడుసార్లు టీమిండియానే సిరీస్‌ ఎగరేసుకుపోవడం విశేషం. ఇందులో ఒక సారి ఇంగ్లండ్‌ గడ్డపై.. రెండుసార్లు స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ల్లో భారత్‌ విజేతగా నిలిచింది. 2017లో ఇండియాకు వచ్చిన ఇంగ్లండ్‌ టీమిండియాతో మూడు టీ20ల సిరీస్‌ ఆడింది. ఆ సిరీస్‌ను ఇండియా 2-1 తేడాతో నెగ్గింది. ఆ తర్వాత భారత జట్టు 2018లో ఇంగ్లండ్‌ పర్యటనలో 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. తాజాగా 2021లో ఐదు టీ20ల సిరీస్‌ను భారత జట్టు 3-2 తేడాతో గెలుచుకొని ఆ రికార్డును మరింత పదిలపరుచుకుంది. 2016 తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌పై గెలిచిన మూడు టీ20 సిరీస్‌ల్లోనూ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లినే ఉండడం మరో విశేషం.

భారత్ బౌలర్లను బాదేసిన బట్లర్, ఇండియాపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం, కెప్టెన్ మోర్గాన్‌ 100 టి20 మ్యాచ్‌లో విజయాన్ని కానుకగా అందించిన సహచరులు

అంతర్జాతీయ టీ20ల్లో డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ టాప్-2లోకి దూసుకొచ్చాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్‌ శర్మ 2వ స్థానానికి దూసుకురాగా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో శనివారం రాత్రి జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో 34 బంతులాడిన రోహిత్ శర్మ 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 3,103 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 2,839 పరుగులతో ఉన్నాడు. అయితే తాజాగా రోహిత్‌ హాఫ్‌ సెంచరీతో రాణించి 2,864 పరుగులతో మార్టిన్‌ను మూడో స్థానానికి నెట్టేశాడు. కాగా రోహిత్‌ శర్మ ఇప్పటివరకు 111 టీ20 మ్యాచ్‌లాడి 2,864 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 3–2తో గెలుచుకుంది.