IND Vs NZ: వరల్డ్‌కప్‌లో భారత్ జోరు కొనసాగేనా? వరుసగా పదో విజయం కోసం ఉవ్విల్లూరుతున్న టీమిండియా, హోరాహోరీ పోరుకు సిద్ధమైన భారత్-న్యూజిలాండ్
సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. తొమ్మిది మ్యాచ్ లను గెలిచి వరుస విజయాలతో రికార్టులను నమోదు చేస్తోంది.
Mumbai, NOV 15: క్రికెట్ అభిమానులకు మరో పండుగ రోజు వచ్చింది. వరల్డ్ కప్ (CWC-23) తొలి సెమీ ఫైనల్ కు చేరుకున్న టీమిండియా మరో గెలుపు కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వాంఖడే స్టేడియం (Wankhede) నేడు జరుగబోతున్న సెమీస్ లో కివీస్ తో భారత్ తలపడబోతుంది. 2019 వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమి పాలైన టీమిండియాకు నాలుగేళ్ల తర్వాత న్యూజిలాండ్ పై (IND Vs NZ) ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ దక్కింది. వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ కు భారత్, కివీస్ సిద్ధమయ్యాయి. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన ముంబై వాంఖడే స్టేడియం ఈ సెమీ ఫైనల్ కు ఆతిథ్యమిస్తోంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న భారత్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్న న్యూజిలాండ్ తో తలపడనుంది. లీగ్ దశలో కివీస్ ను మట్టి కరిపించిన భారత్ సెమీస్ లోనూ (Semis) అదే జోరు కనబరిచి ఫైనల్స్ లో అడుగు పెట్టాలన్న ఉత్సాహంతో ఉంది. వరుసగా రెండో సారి వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో సెమీస్ లో తలపడుతున్న టీమిండియా 2019లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది.
48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ఎనిమిదోసారి, న్యూజిలాండ్ తొమ్మిదోసారి సెమీస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. తొమ్మిది మ్యాచ్ లను గెలిచి వరుస విజయాలతో రికార్టులను నమోదు చేస్తోంది. బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణిస్తున్న భారత్ కు స్వదేశంలో కివీస్ ను ఓడించడం పెద్ద కష్టమేవి కాదని క్రికెట్ అభిమానులు నమ్ముతున్నారు.
ఇక ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించనున్నాడు. వరల్డ్ కప్ లో నాలుగు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన ఏకైక భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనిలు మూడు వరల్డ్ కప్‌ల్లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఆడారు. కానీ విరాట్ నాలుగోసారి వరల్డ్ కప్ సెమీస్‌లో ఆడుతున్నాడు. దీంతోపాటూ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే 50 సెంచరీలు చేసిన రికార్డు కూడా సృష్టించే అవకాశముంది.