IPL 2022 Mega Auction: డేవిడ్ వార్నర్‌కు భారీ షాక్, శ్రేయస్‌ అయ్యర్‌ కోసం రూ. 12.25 కోట్లు వెచ్చించిన కెకెఆర్, రూ. 5 కోట్లకు రవిచంద్రన్‌ అశ్విన్‌ వేలం, పూర్తి లిస్ట్ ఇదే..

అగ్రశ్రేణి ఆటగాళ్ల (మార్కీ ప్లేయర్లు) జాబితాలో మొదటి వరుసలో ఉన్న టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ముందుగా వేలంలోకి (IPL 2022 Mega Auction) వచ్చాడు. ఈ క్రమంలో పంజాబ్‌ కింగ్స్‌ 8. 25 కోట్లు వెచ్చించి గబ్బర్‌ను కొనుగోలు చేసింది.

Shreyas Iyer (Photo/ BCCI Twitter)

ఐపీఎల్‌ మెగా వేలం-2022 ఆరంభమైంది. అగ్రశ్రేణి ఆటగాళ్ల (మార్కీ ప్లేయర్లు) జాబితాలో మొదటి వరుసలో ఉన్న టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ముందుగా వేలంలోకి (IPL 2022 Mega Auction) వచ్చాడు. ఈ క్రమంలో పంజాబ్‌ కింగ్స్‌ 8. 25 కోట్లు వెచ్చించి గబ్బర్‌ను కొనుగోలు చేసింది. ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌ను రూ. 5 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌కు (Shreyas Iyer most expensive buy) రూ. 12.25 కోట్లు వెచ్చించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సొంతం చేసుకుంది.

ఇక వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ వేలంలోకి వచ్చాడు. అతని కనీస ధర రూ.1.50 కోట్లుగా ఉంది. కాగా హోల్డర్‌కు జాక్‌పాట్‌ తగిలింది. రూ. 8.75 కోట్లకు లక్నో సూపర్‌జెయింట్స్‌ దక్కించుకుంది. టీమిండియా అన్‌క్యాప్‌డ్‌ ఆటగాడు నితీష్‌ రాణాను మరోసారి కేకేఆర్‌ సొంతం చేసుకుంది. రూ. 8 కోట్లకు రాణాను సొంతం చేసుకోవడం విశేషం. గత సీజన్‌లో నితీష్‌ రాణా మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవోను సీఎస్‌కే మరోసారి దక్కించుకుంది. రూ. 4.40 కోట్లకు సీఎస్‌కే బ్రేవోను దక్కించుకుంది.

టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్‌ రైనాతో పాటు.. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌, దక్షిణాఫ్రికా ఆటగాడు మిల్లర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనడానికి ఆసక్తి చూపలేదు. యాక్సిలరేటెడ్‌ లిస్ట్‌లో ఈ ముగ్గురు మరోసారి వేలంలోకి రానున్నారు. టీమిండియా యువ ఆటగాడు దేవదూత్‌ పడిక్కల్‌కు మెగావేలంలో భారీ ధర పలికింది. పడిక్కల్‌ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. రాజస్తాన్‌ రాయల్స్‌కు రూ. 7.75 కోట్లు వెచ్చించి పడిక్కల్‌ను కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఆర్‌సీబీకి రూ. 20 లక్షలకు అమ్ముడుపోయిన పడిక్కల్‌ దుమ్మురేపిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ మెగా వేలం రూల్స్ ఇవే! రెండు రోజు మెగా ఈవెంట్‌ కు సర్వం సిద్ధం, కొత్త టీమ్‌ల రాకతో ఆసక్తికరంగా వేలం

టీమిండియా సీనియర్‌ ఆటగాడు రాబిన్‌ ఊతప్పను కనీస ధర రూ. 2 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేయగా.. ఇంగ్లండ్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 2 కోట్ల కనీస ధరకు దక్కించుకుంది.వెస్టిండీస్‌ హిట్టర్‌ షిమ్రోన్‌ హెట్‌మైర్‌కు వేలంలో మంచి ధరే దక్కింది. అతని కనీస ధర రూ. 1.50 కోట్లు కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ పోటీపడ్డాయి. చివరకు రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 8.25 కోట్లకు హెట్‌మైర్‌ను దక్కించుకుంది. మనీష్‌ పాండేను లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ. 4.6 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. కోటిగా ఉంది.

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ రూ. 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు అమ్ముడుపోయాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. అయితే వార్నర్‌ ఇంత తక్కువ ధరకు అమ్ముడుపోతాడని ఎవరు ఊహించలేదు. 2016 ఎస్‌ఆర్‌హెచ్‌ను చాంపియన్స్‌గా నిలిపిన వార్నర్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ అవమానకరరీతిలో రిలీజ్‌ చేసింది. ఆ తర్వాత వార్నర్‌ తనదైన ఆటతీరుతో మెప్పించాడు. ఈసారి వేలంలో మంచి ధర దక్కుతుంది అని భావించిన ఫ్యాన్స్‌కు ఇది నిరాశే అని చెప్పొచ్చు.

గత సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన క్వింటన్‌ డికాక్‌ కనీస ధర రూ. 2 కోట్లు. కాగా లక్నో సూపర్‌జెయింట్స్‌ రూ. 6.75 కోట్లకు డికాక్‌కు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ను ఆర్‌సీబీ రూ. 7 కోట్లకు దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 2 కోట్లు ఉంది. గత సీజన్‌ వర​కు డుప్లెసిస్‌ సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ కనీస ధర రూ. 2 కోట్లు. గత సీజన్‌లో షమీ పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. కాగా షమీని ఈసారి వేలంలో రూ. 6.25 కోట్లకు గుజరాత్‌ టైటాన్స్‌ దక్కించుకుంది.

న్యూజిలాండ్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ వేలంలోకి వచ్చాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. బౌల్ట్‌ను దక్కించుకోవడం కోసం రాజస్తాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్‌ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 8 కోట్లకు బౌల్ట్‌ను దక్కించుకుంది. దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ కగిసో రబడా కనీస ధర రూ. 2 కోట్లు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ప్రాతినిధ్యం వహించిన రబాడపై ఫ్రాంచైజీలు ఆసక్తికరంగా ఉన్నాయి. దీంతో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌ గట్టిపోటి ఇచ్చినప్పటికి.. చివరికి పంజాబ్‌​ కింగ్స్‌ రూ. 9.25 కోట్లతో రబాడను దక్కించుకుంది.

ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ మూడో ఆటగాడిగా వేలంలోకి వచ్చాడు. కమిన్స్‌ కనీస ధర రూ. 2 కోట్లు. గతేడాది వేలంలో కేకేఆర్‌(రూ.15.50 కోట్లు) అత్యధిక ధరకు అమ్ముడైన పాట్‌ కమిన్స్‌.. ఈసారి మాత్రం సగానికి పడిపోయాడు. రూ. 7.25 కోట్లతో కమిన్స్‌ను మళ్లీ కేకేఆర్‌ కొనుగోలు చేసింది.

టాప్‌- 10: ఎవరెవరు ఎంతకు అమ్ముడుపోయారంటే!

1.శిఖర్‌ ధావన్‌: రూ. 8.25 కోట్లు- పంజాబ్‌ కింగ్స్‌

2.రవిచంద్రన్‌ అశ్విన్‌: 5 కోట్లు- రాజస్తాన్‌ రాయల్స్‌

3.ప్యాట్‌ కమిన్స్‌: 7.25 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్‌

4.కగిసో రబడ: 9.25 కోట్లు- పంజాబ్‌ కింగ్స్‌

5.ట్రెంట్‌ బౌల్ట్‌: 8 కోట్లు- రాజస్తాన్‌ రాయల్స్‌

6. శ్రేయస్‌ అయ్యర్‌: 12.25 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్‌

7. మహ్మద్‌ షమీ- 6.25 కోట్లు- గుజరాత్‌ టైటాన్స్‌

8. ఫాఫ్‌ డుప్లెసిస్‌- 7 కోట్లు- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)

9. క్వింటన్‌ డికాక్‌- 6.75 కోట్లు- లక్నో సూపర్‌ జెయింట్స్‌

10. డేవిడ్‌ వార్నర్‌- 6.25 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌

రిటెన్షన్‌ నేపథ్యంలో 8 ఫ్రాంఛైజీల ఖాతాలో మిగిలిన మొత్తం:

ఢిల్లీ క్యాపిటల్స్‌- 47.5 కోట్లు

చెన్నై సూపర్‌ కింగ్స్‌- 48 కోట్లు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- 57 కోట్లు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌- 48 కోట్లు

ముంబై ఇండియన్స్‌- 48 కోట్లు

పంజాబ్‌ కింగ్స్‌- 72 కోట్లు

రాజస్తాన్‌ రాయల్స్‌- 62 కోట్లు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 68 కోట్లు