Bengaluru, Feb 12: ఐపీఎల్‌ మెగా వేలం-2022కు (IPL 2022 Auction) రంగం సిద్ధమైంది. శని, ఆదివారాల్లో బెంగళూరు (Bengaluru) వేదికగా ఈ మెగా ఈవెంట్‌ జరుగనుంది. ఇక ఈసారి రెండు కొత్త జట్లు గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans), లక్నో సూపర్‌జెయింట్స్‌ లీగ్‌లో ( Lucknow Super Giants ) ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో మొత్తంగా 10 జట్లు పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న రైట్‌ టు మ్యాచ్‌ (RTM) కార్డ్‌ను వేలం నుంచి తొలగించారు. వేలంలో మరొకరు సొంతం చేసుకున్నా... గత ఫ్రాంచైజీ అంతే మొత్తం ఇచ్చి వారిని తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు కొత్త జట్లకు కూడా ఎంపికలో సమాన అవకాశం ఉండాలనే కారణంగా దీన్ని తీసివేశారు. పది మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు మినహా మిగిలిన వారిని వివిధ విభాగాలు (SET)గా విభజించారు. బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్లు కీపర్లు, పేస్‌ బౌలర్లు, స్పిన్‌ బౌలర్లు... ఇలా ఒకదాని తర్వాత మరొక భిన్నమైన సెట్‌ల ప్రకారం వేలం నిర్వహిస్తారు. కనిష్టంగా రూ. 20 లక్షల నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు బేస్‌ప్రైస్‌తో క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. ఈ ఆక్షన్‌ లో 49 మంది కనీస విలువ రూ. 2 కోట్లతో వేలం బరిలోకి దిగుతున్నారు. మార్క్యూ ఆటగాళ్ల జాబితాలో అశ్విన్, శ్రేయస్‌ అయ్యర్, శిఖర్‌ ధావన్ (Shikhar dhawan), షమీ (Shami), బౌల్ట్‌ (boult trent), వార్నర్, కమిన్స్‌ (Cummins), రబడ, డికాక్, డు ప్లెసిస్‌ (దక్షిణాఫ్రికా) ఉన్నారు.

అయితే కొంతమంది కీలక ఆటగాళ్లు ఈ సారి వేలానికి దూరమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పలువురు క్రికెటర్లు వేర్వేరు కారణాలతో ఈ సీజన్‌ ఐపీఎల్‌ ఆడకూడదని నిర్ణయించుకున్నారు. వీరిలో క్రిస్‌ గేల్(Chris Gayle), బెన్‌ స్టోక్స్, మిచెల్‌ స్టార్క్, కైల్‌ జేమీసన్, స్యామ్‌ కరన్, జాయ్‌ రిచర్డ్సన్, డాన్‌ క్రిస్టియాన్, క్రిస్‌ వోక్స్, మాట్‌ హెన్రీ వంటి ప్లేయర్స్ ఉన్నారు.

ఐపీఎల్‌లో గత రికార్డు, ప్రస్తుతం జట్ల అవసరాలు, భవిష్యత్తు... ఇలా అన్నీ చూస్తే వేలంలో కొందరు ఆటగాళ్లకు భారీ మొత్తం దక్కే అవకాశం కనిపిస్తోంది. విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్, కెప్టెన్సీ అర్హతలు ఉన్న శ్రేయస్‌ అయ్యర్(shreyas iyer), వికెట్‌ కీపింగ్‌ హిట్టర్లు ఇషాన్‌ కిషన్, క్వింటన్‌ డి కాక్, టాప్‌ లెగ్‌ స్పిన్నర్‌ చహల్, ఫాస్ట్‌ బౌలర్‌ కగిసో రబడలకు మంచి డిమాండ్‌ ఉంది. మిగతా భారత ఆటగాళ్లలో దీపక్‌ చహర్, శార్దుల్‌ ఠాకూర్, ప్రసిధ్‌ కృష్ణ కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు టీమిండియాకు ఆడని అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లలో భారీ షాట్లు ఆడే తమిళనాడు ప్లేయర్‌ షారుఖ్‌ ఖాన్, యువ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌లపై అందరి దృష్టీ ఉంది.