Laureus Sports Awards 2020: రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ కప్ విజయోత్సవ ర్యాలీ, లారస్ స్పోర్టింగ్ మూమెంట్ విజేతగా నిలిచిన మాస్టర్ బ్లాస్టర్
చివరకు 22 ఏళ్ల తర్వాత తన చిట్టచివరి ప్రపంచ కప్ మ్యాచ్ 2011 లో సచిన్ స్వప్నం నెరవేరింది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది....
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సందర్భాలలో ఒకటి, 2011 క్రికెట్ ప్రపంచ కప్ విజయం. గౌతమ్ గంభీర్ వీరోచిత ఇన్నింగ్స్, ఉత్కంఠ పోరులో చివరి బంతికి 'అండ్.. దట్స్ ద హెలికాప్టర్ షాట్, ధోనీ ఫినిషిడ్ ఇట్ ఆఫ్ ఇన్ స్టైల్' కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన సిక్స్, ముంబై వాంఖడే స్టేడియంలో ఆకాశాన్ని తాకిన ప్రేక్షకుల హర్షధ్వానాలు. ఆ తర్వాత అందరి చూపులు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పైనే, టీమిండియా జట్టు సభ్యులు ఆ క్రికెట్ దేవుడిని తమ భుజాలపై మోస్తుండగా, సచిన్ చిరకాల స్వప్నం నెరవేరిన ఆ క్షణం, లక్షల కోట్ల మంది భావోద్వేగం. ఆ అపురూప క్షణాల గురించి ఎంత చెప్పినా, ఎన్ని సార్లు చూసినా, ఎన్నిసార్లు స్మరించుకున్నా భారతీయులకు తనివి తీరదు. ఇప్పుడు అవే అపురూప క్షణాలను ( 2011 World cup Victory Lap) ప్రతిష్ఠాత్మక లారస్ అవార్డుతో సత్కరించారు.
2011 క్రికెట్ ప్రపంచ కప్ విజయం తరువాత మైదానంలో సచిన్ టెండూల్కర్ ఊరేగింపు 2000-2020కి కాలానికి గానూ 'లారస్ స్పోర్టింగ్ మూమెంట్' గా ఎన్నుకోబడింది. గత రెండు దశాబ్దాల క్రీడా చరిత్రలో ఇంతటి అపురూపమైన సందర్భం మరొకటి లేదని, సచిన్ టెండూల్కర్ కు లారస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డ్స్‌ను అందజేశారు. 2000 నుంచి 2020 వరకు క్రికెట్ చరిత్రలో బెస్ట్ స్పోర్టింగ్ సందర్భాలపై ప్రపంచవ్యాప్తంగా ఓటింగ్ నిర్వహించగా, అందులో సచిన్ ఊరేగింపుకే అత్యధిక ఓట్లు వచ్చాయి. దిగ్గజ క్రికెటర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా చేతుల మీదుగా సచిన్‌కు ట్రోఫీ ప్రదానం జరిగింది.
Laureus Sporting Moment 2000-2020
అవార్డ్ అందుకుంటూ సచిన్ మాట్లాడుతూ "ఎలాంటి మిశ్రమ అభిప్రాయాలు లేకుండా దేశం మొత్తం ఒక్కసారి సంబరాలు చేసుకునే అత్యద్భుత ఘటనలు ఎన్నిసార్లు జరుగుతాయి? చాలా చాలా అరుదు. క్రీడలు ఎంత శక్తివంతమైనవో మరోసారి గుర్తుచేసిన రోజది. ఆ మధురక్షణాలు నాతో ఎప్పటికీ ఉంటాయి" అంటూ ఆనాటి ప్రపంచ కప్ విజయం క్షణాలను 'క్రికెట్ దిగ్గజం' గుర్తుచేసుకున్నారు. మెగా ఐపీఎల్ 2020 13వ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్
అంతకుముందు 5 సార్లు ప్రపంచకప్ టోర్నీలో పాల్గొన్న సచిన్ టెండూల్కర్, తన కెరియర్‌లో ఎన్ని మైలురాళ్లను అధిగమించినా, ప్రపంచకప్ మాత్రం అందుకోలేకపోయాడు. చివరకు 22 ఏళ్ల తర్వాత తన చిట్టచివరి ప్రపంచ కప్ మ్యాచ్ 2011 లో సచిన్ స్వప్నం నెరవేరింది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.