IPL 2022: ఐదో పరాజయం మూటగట్టుకున్న ఢిల్లీ, ఏడో విజయం నమోదు చేసిన లక్నో, 6 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం
ఆదివారం జరిగిన పోరులో లక్నో 6 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందింది. లక్నోకు వరుసగా ఇది మూడో విజయం కాగా.. ఢిల్లీ ఐదో పరాజయం మూటగట్టుకుంది. ఆడిన పది మ్యాచ్‌ల్లో ఏడింట నెగ్గిన లక్నో 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు దగ్గరైంది.
లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్-15వ సీజన్‌లో ఏడో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో లక్నో 6 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందింది. లక్నోకు వరుసగా ఇది మూడో విజయం కాగా.. ఢిల్లీ ఐదో పరాజయం మూటగట్టుకుంది. ఆడిన పది మ్యాచ్‌ల్లో ఏడింట నెగ్గిన లక్నో 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు దగ్గరైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
కెప్టెన్ లోకేశ్ రాహుల్ (51 బంతుల్లో 77; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), దీపక్ హుడా (34 బంతుల్లో 52; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 189 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ రిషబ్ పంత్ (30 బంతుల్లో 44; 7 ఫోర్లు, ఒక సిక్సర్), అక్షర్ పటేల్ (24 బంతుల్లో 42 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. లక్నో యువ పేసర్ మొహసిన్ ఖాన్ (4/16) అదరగొట్టాడు.
ఓపెనర్లు పృథ్వీ షా (5), వార్నర్ (3) విఫలంకాగా.. మిషెల్ మార్ష్ (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రావ్‌మన్ పావెల్ (21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 46 పరుగులు అవసరమైన దశలో కుల్దీప్ సేన్ (16 నాటౌట్)తో కలిసి అక్షర్ పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. మొహసిన్ ఖాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా సోమవారం జరుగనున్న మ్యాచ్‌లో కోల్‌కతాతో రాజస్థాన్ తలపడనుంది.