MS Dhoni Back as CSK Captain: మళ్లీ ధోనీ చేతికే సీఎస్కే పగ్గాలు, కెప్టెన్సీ వదులుకున్న రవీంద్ర జడేజా, వరుస వైఫల్యాలతో గుడ్ బై చెప్పిన ఆల్‌ రౌండర్
CSK Logo (Photo Credits: Twitter/Chennai Super Kings)

Mumbai, April 30: టీ20 లీగ్‌లో చెన్నై (Chennai)సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు నాయకత్వ బాధ్యతలను మళ్లీ ఎంఎస్ ధోనీకి (M.S. Dhoni) అప్పగించింది. 15వ సీజన్‌ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోనీ జట్టు పగ్గాలను వదిలేయడంతో రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా (Ravindra Jadeja) నియమించింది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది మ్యాచుల్లో కేవలం రెండింటిలోనే చెన్నై విజయం సాధించింది. మరోవైపు ఆల్‌రౌండర్‌ పాత్రను పోషించడంలో జడేజా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీకే సారథ్య బాధ్యతలను అప్పగిస్తున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. వరుస వైపల్యాలతో జడేజా కూడా ఆట మీద ఫోకస్ కోల్పోతున్నాడని, ఆయన ఆటపై దృష్టి సారించేందుకు కెప్టెన్సీ బాధ్యతలను వదులుకుంటున్నట్లు టీమ్ తెలిపింది. అయితే ఈ సీజన్‌లో సీఎస్కే ఇప్పటికే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దానంతటికీ జడేజాను బాధ్యుడ్ని చేస్తూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

‘‘ఆటపై దృష్టిసారించేందుకే రవీంద్ర జడేజా కెప్టెన్సీ వదిలేశాడు. అందుకే జట్టును నడిపించాలని ఎంఎస్ ధోనీని (M.S. Dhoni) కోరాం. నాయకత్వ పగ్గాలను అందుకునేందుకు ఎంఎస్ ధోనీ అంగీకరించాడు. ఇక నుంచి జడేజా తన ఆటపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తాడు’’ అని జట్టు యాజమాన్యం వెల్లడించింది. నాలుగుసార్లు చెన్నైకి టీ20 లీగ్‌ టైటిల్‌ను అందించిన ధోనీ సీజన్‌ పోటీల ప్రారంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకొని జడేజాకు అప్పగించాడు. ఆదివారం హైదరాబాద్‌తో చెన్నై తలపడనుంది.