Mayank Cyclone: విశాఖపట్నంలో 'మయాంక్' తుఫాన్, చిగురుటాకులా వణికిన దక్షిణాఫ్రికా బౌలర్లు, మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ, రోహిత్ శర్మ సెంచరీ, భారత్ 502/7 డిక్లేర్డ్
టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో రోహిత్, మయాంక్ మినహా మిగతా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. పూజారా 06, కెప్టెన్ కోహ్లీ 20, రహానే 15, ఆంధ్రా లోకల్ హనుమ విహారి 10 మరియు వృద్ధిమాన్ సాహా 21 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో...
టీమిండియా నుండి అసలు ఇలాంటి కొట్టుడు చూసి చాలా కాలమైంది. ఒక శివమణి జాస్ కొట్టినట్లు, ఒక జాకీర్ హుస్సేన్ తబల కొట్టినట్లు, శంకర్ సినిమాకి ఏ.ఆర్ రహమాన్ వాయించినట్లు కొట్టుడు, ఫీల్డర్లను పరిగెత్తించుడూ, కొట్టుడు, ఫీల్డర్లను పరిగెత్తించుడూ అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ కలిసి దక్షిణాఫ్రికా బౌలర్లను పిచ్చికొట్టుడు కొట్టారు. ఈ బీభత్సమైన ఈ బ్యాటింగ్ కి విశాఖపట్నంలో పరుగుల అలలు ఎగసిపడ్డాయి.
ఇక అసలు విషయాన్ని సూటిగా చెప్పుకుంటే, భారత్ (India) మరియు దక్షిణాఫ్రికా (South Africa) మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో, టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 502 పరుగుల భారీస్కోర్ చేసింది. స్వదేశంలో తొలి టెస్ట్ ఆడుతున్న మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) డబుల్ సెంచరీతో పరుగుల తుఫాన్ తీసుకొచ్చాడు. 371 బంతులు ఆడిన మయాంక్ 215 పరుగులు చేశాడు. ఇందులో 23 ఫోర్లు మరియు ఐదు సిక్సర్లు ఉన్నాయి, 215 వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్గర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. (లసిత్ మలింగాకి వారసుడొచ్చాడు)
అంతకుముందు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా 176 పరుగులు చేసి కొద్దిలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. రోహిత్ తన ఇన్నింగ్స్ లో 23 ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు, వీరిద్దరు కలిసి తొలివికెట్ కి 317 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పారు. గత ఆరేళ్లలో టీమిండియాకి టెస్టులో తొలివికెట్ కి 200 పరుగులకు పైగా భాగస్వామ్య రావడం ఇదే తొలిసారి. దీంతో 2005లో వీరేంద్ర సెహ్వాగ్ - గౌతం గంభీర్‌ల జోడి సఫారీలపై చేసిన 218 పరుగుల భాగస్వామ్యం రికార్డ్ బ్రేక్ అయింది. టెస్టుల్లో తొలివికెట్ కి టీమిండియాకి 300 పైగా స్కోర్ రావడం ఇది మూడోసారి కాగా, దక్షిణాఫ్రికాపై ఇదే తొలిసారి. (Also Read: మా ఆట మాదే! ICCకే సవాల్ విసురుతున్న GCC)
కాగా, గురువారం రెండో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ ఆట పూర్తయింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్, మయాంక్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. పూజారా 06, కెప్టెన్ కోహ్లీ 20, రహానే 15, ఆంధ్రా లోకల్ హనుమ విహారి 10 మరియు వృద్ధిమాన్ సాహా 21 పరుగులు చేశారు. క్రీజులో రవీంద్ర జడేజా 27*, అశ్విన్ 1* ఆడుతుండగా భారత్ స్కోర్ 502/7 వద్ద కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేశాడు, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది.