ఇండియా ఒక దేశమైతే, క్రికెట్ (Cricket) ఆ దేశంలో ఒక మతం. కరుడుగట్టిన క్రికెట్ ప్రేమికులు ఇక్కడ ఉంటారు. అయితే ఈ క్రికెట్ ఆటను అంతర్జాతీయంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC - International Cricket Council) నిర్వహిస్తుంది. ప్రపంచంలో ఏ దేశ జట్టైనా, ఏ క్రికెటర్ అయినా ఐసీసీ నిబంధనలకు (Rules) అనుగుణంగానే క్రికెట్ ఆటను ఆడాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ఆ నియామావళిని ఉల్లంఘిస్తే ఎంత తోపు క్రికెటర్ అయినా ఐసీసీ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది.
ఇలా ప్రపంచ క్రికెట్ దేశాలన్నింటిని తన గుప్పిట్లో పెట్టుకుని 'ఆట' ఆడిస్తున్న ఐసీసీకి మరో క్రికెట్ మండలి సవాల్ విసురుతుంది. ఏ ఐసీసీ, ఐసీయూ జాన్తా నై. ఇక్కడ మేం ఆడిందే ఆట, మేం పెట్టిందే రూల్ అని ఐసీసీనే ఉల్టా దబాయిస్తుంది. అది బీసీసీఐ (BCCI) అని మీరు భావిస్తున్నారా? కాదు అంతకంటే పవర్‌ఫుల్ అయిన వీధి క్రికెట్ మండలి (GCC - Gully Cricket Council).
ఐసీసీ నిబంధనలన్నింటినీ కిందపడేసి తొక్కి, తనకు తానే కొత్త రూల్స్ తయారు చేసుకుంది. ICC vs GCC అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఒకసారి ఈ ఐసీసీ మరియు జీసీసీ నడుమ రూల్స్ ఎలా ఉన్నాయో చూడండి.
ICC rule: ఒక జట్టులో 11 మంది సభ్యులుండాలి.
GCC rule: ఎంత మంది ఆడటానికి వస్తే అంతమందితో.
ICC rule: టాస్ గెలిస్తే వారి జట్టు వ్యూహం ప్రకారం కెఫ్టెన్ డిసైడ్ అవుతాడు బ్యాటింగ్ చేయాలా? బౌలింగ్ వేయాలా అని.
GCC rule: డౌటే లేదు.. టాస్ గెలిస్తే బ్యాటింగే.
ICC rule: ముందుగానే నిర్ణయించిన బ్యాట్స్‌మెన్ ఓపెనర్స్ గా వస్తారు.
GCC rule: బ్యాటింగ్ కోసం కొట్లాడుకోవాలి, ఎవరు గెలిస్తే వాళ్లు బ్యాటింగ్ కి వస్తారు.
ICC rule: బ్యాట్స్‌మెన్ ఫస్ట్ బాల్ కే ఔట్ అయితే 'గోల్డెన్ డక్' అంటారు.
GCC rule: ఔట్ లేదు, గీవుట్ లేదు. ఫస్ట్ బాల్ కి ఔట్ అయితే అది 'ట్రయల్ బాల్' అంటారు.
ICC rule: బ్యాట్స్‌మెన్ గ్రౌండ్ లో ఏ వైపుకైనా, ఫోర్ లేదా సిక్స్ కొట్టొచ్చు.
GCC rule: ఏదో ఒకసైడ్ మాత్రమే ఫోర్ కొట్టాలి, వేరే సైడ్ కొడితే 'నో రన్స్', దగ్గరగా ఉన్న బౌండరీ లైన్ కి తాకితే 2 రన్స్ డిక్లేర్డ్, సిక్స్ కొడితే ఔట్.. సిక్స్ కొట్టిన బ్యాట్స్‌మెనే బాల్ తీసుకొచ్చి ఇవ్వాలి.
ICC rule: బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్‌మెన్ ఆడొచ్చు లేదా ఆడకుండా వదిలేయొచ్చు.
GCC rule: బౌలర్ వేసిన బంతి బ్యాట్స్‌మెన్ ఆడకుండా వరుసగా 3 సార్లు మిస్ అయితే అవుట్.
ICC rule: బౌలర్ వైడ్స్ లేదా నోబాల్స్ వేస్తే అవి ఎక్స్‌ట్రాస్
GCC rule: 'ఎక్స్‌ట్రాలు' చేస్తే 'బేబీ ఓవర్' లేదా బౌలింగ్ నుంచి తపించడం.
ఇలా ఒకటేమిటి, ఎవరు గెలిస్తే ఆ జట్టే మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాడు ఫస్ట్ బౌలింగ్ చేయొద్దు, అంపైర్ మనకు అనుకూలంగా డిసిషన్ ఇవ్వకపోతే అంపైర్ ని తిట్టొచ్చు, అవసరమైతే కొట్టొచ్చు, ఇలాంటివి ఇంకా ఎన్నో కఠినమైన, భయంకరమైన రూల్స్ ఉంటాయి. గొడవలు, కొట్లాటలు నరాలు తెగేంత ఉత్కంఠంత ఐసీసీ టోర్నమెంట్ల కంటే దీటుగా ఎంతో హీట్ పెంచేలా జీసీసీలో మ్యాచులు జరుగుతాయి.