T20 World Cup 2022: బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ, ఆ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతనికే ఉందని వెల్లడించిన భారత మాజీ క్రికెటర్ సబా కరీమ్
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022 నుంచి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022 నుంచి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జట్టులో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఉన్నప్పటికీ ఈ మధ్య ఫాంలో లేకపోవడం ఆందోళన కలిగించే అంశమే.
కాగా ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌లో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే సత్తా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి ఉందని భారత మాజీ క్రికెటర్ సబా కరీమ్ అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల ప్రాధాన జట్టులో షమీకి చోటు దక్కలేదు. అతడిని ఈ పొట్టి ప్రపంచకప్‌కు స్టాండ్‌బైగా భారత సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే జట్టు ప్రకటించినప్పటి నుంచే షమీని ప్రధాన జట్టులోకి తీసుకోవాలని మాజీలు, క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు .
మహ్మద్ షమీ అద్భుతమైన పేస్ బౌలర్. అతడికి టీ20 ఫార్మాట్‌లో కొత్త బంతితో వికెట్లు తీసే సత్తా ఉంది. అదే విధంగా డెత్ ఓవర్లలో కూడా షమీ పరుగులు కట్టడి చేయగలడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా అతడు అద్భుతంగా రాణించాడు. ఈ సమయంలో అతడి సేవలు భారత జట్టుకు చాలా అవసరమని మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డారు. ఒక వేళ అతడిని టీ20 ప్రపంచకప్ ప్రధాన జట్టులోకి తీసుకోకపోతే భారత బౌలింగ్ విభాగం మరింత క్షీణిస్తుందని తెలిపాడు.