WPL Final 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ముంబై కైవసం, దుమ్మురేపిన హర్మన్ ప్రీత్, ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి చాంపియన్స్‌గా అవతరించిన ముంబై ఇండియన్స్
టోర్నీ ఆరంభం నుంచి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న హర్మన్‌ప్రీత్ సేన చాంపియన్‌గా అవతరించింది.
Mumbai, March 26: టైటిల్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (Women's Premier League) తొలి సీజన్ విజేతగా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న హర్మన్‌ప్రీత్ సేన చాంపియన్‌గా అవతరించింది. బలమైన ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)పై హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించి ఢిల్లీని తక్కువకే కట్టడి చేసిన ముంబై.. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ స్కీవర్ బ్రంట్ సాధికార ఇన్నింగ్స్ ఆడడంతో సులువుగా విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు పోరాడిన ఢిల్లీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 132 లక్ష్య ఛేదనలో ముంబై 23 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయింది. హేలీ మాథ్యూస్(13), యస్తికా భాటియా (4) తొందరగానే ఔటయ్యారు. దాంతో, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(37)తో కలిసి బ్రంట్ మూడో వికెట్‌కు 72 రన్స్ జోడించింది. హర్మన్‌ప్రీత్ (Harmanpreet Kaur) రనౌట్ అయింది. అప్పటికే ముంబై విజయం ఖాయమైంది. మేలియా కేర్ (14) లాఛనంగా మ్యాచ్ ముగించారు. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, అలిసే తలా ఒక వికెట్ తీశారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 రన్స్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఇసీ వాంగ్ దెబ్బకొట్టింది. తన మొదటి ఓవర్‌లోనే లో ఫుల్ టాస్ బంతులతో కీలకమైన ఓపెనర్ షఫాలీ వర్మ(11), అలిసే క్యాప్సే(0)లను ఔట్ చేసింది. దాంతో, 12 పరుగులకే ఢిల్లీ ప్రధాన వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మేగ్ లానింగ్ (35), మరినే కాప్ (18), జెమీమా రోడ్రిగ్స్ (9), జొనాసెన్ (2), అరుంధతి రెడ్డి(0) విఫలమయ్యారు.
ఒక దశలో ఆ జట్టు 80 రన్స్ లోపే ఆలౌట్ అవుతుందనిపించింది. కానీ, చివర్లో రాధా యాదవ్(27), శిఖా పాండే (27) బ్యాట్ ఝులిపించడంతో పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. ధాటిగా ఆడిన శిఖా, రాధ పదో వికెట్‌కు ఏకంగా 52 రన్స్ కొట్టారు. ముంబై బౌలర్లలో ఇసీ వాంగ్, హేలీ మాథ్యూస్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. మేలియా కేర్ రెండు వికెట్లు తీసింది.