PBKS vs CSK IPL 2021 Highlights: ధోని సరికొత్త రికార్డు, చహర్ బౌలింగ్ దెబ్బకు విలవిలలాడిన పంజాబ్, 6 వికెట్లతో పంజాబ్ కింగ్స్‌పై విజేతగా నిలిచిన సీఎస్‌కే, మెరుపులు, అనూహ్య మలుపులు లేకుండానే ముగిసిన మ్యాచ్
పేసర్ దీపక్ చాహర్ తన ఐపీఎల్ కెరీర్‌లో అదిరిపోయే గణాంకాలు (PBKS vs CSK IPL 2021 Highlights) నమోదు చేయడంతో పంజాబ్ కింగ్స్ దారుణంగా తడబడింది. దీంతో సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో గెలిచింది.
ఐపీఎల్ తాజా సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘనమైన బోణీ చేసింది. పేసర్ దీపక్ చాహర్ తన ఐపీఎల్ కెరీర్‌లో అదిరిపోయే గణాంకాలు (PBKS vs CSK IPL 2021 Highlights) నమోదు చేయడంతో పంజాబ్ కింగ్స్ దారుణంగా తడబడింది. దీంతో సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో గెలిచింది. మెరుపులు, అనూహ్య మలుపులు లేకుండానే శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని సీఎస్‌కే 6 వికెట్లతో పంజాబ్ కింగ్స్‌పై విజేతగా నిలిచి గెలుపు ఖాతాను తెరిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (4/13) బెంబేలెత్తించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. షారుఖ్ ఖాన్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్యామ్ కరన్, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావోలు తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 107 పరుగులు చేసి గెలుపొందింది. మొయిన్ అలీ (31 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్)... డు ప్లెసిస్ (33 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. షమీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా దీపక్ చాహర్ (Deepak Chahar) నిలిచాడు.
మరోవైపు చెన్నై తరఫున ధోనీ (MS Dhoni) కిది 200వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఇన్ని మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్ ధోనీనే. ఐపీఎల్‌లో ధోనీకి 206వ మ్యాచ్. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇన్ని మ్యాచులు ఆడిన క్రికెటర్ కూడా ధోనీనే కావడం గమనార్హం. తాను ఆడిన 206 మ్యాచుల్లో ధోనీ 40.63 సగటుతో 4,632 పరుగులు చేశాడు. ఇలా ఒక టోర్నీలో ఒక ఫ్రాంచైజీకి అత్యథిక మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా ధోనీ రికార్డు సృష్టించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకూ సీఎస్‌కే తరఫున ఆడిన ధోని 200 మ్యాచ్‌లు ఆడగా, అందులో 176 ఐపీఎల్‌లో ఆడాడు. మిగతా 24 మ్యాచ్‌లను చాంపియన్స్ లీగ్ టీ20(సీఎల్‌టీ) ద్వారా చెన్నైకు ప్రాతినిథ్యం వహించాడు. 2016, 2017 సీజన్లు మినహాయించి మిగతా అన్ని సందర్భాల్లోనూ సీఎస్‌కే తరఫునే ధోని ఆడుతున్నాడు. 2008లో ఆ ఫ్రాంచైజీ మొదలైన ధోని ప్రస్థానం నేటికీ కొనసాగుతూనే ఉంది
ఇప్పటివరకూ ధోని 206 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరఫున 2016-17 సీజన్లలో 39 మ్యాచ్‌లు ఆడాడు. ధోని తర్వాత స్థానాల్లో వరుసగా రోహిత్ శర్మ(202), దినేశ్ కార్తీక్(198), సురేశ్ రైనా(195)లు ఉన్నారు. ధోని ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అతని గణాంకాలు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటివరకూ సీఎస్‌కేకు మూడుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను అందించిన ధోని.. ఈ క్యాష్ రిచ్ లీగ్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడు. ఇప్పటివరకూ ధోని 4, 652 పరుగులు చేశాడు. ఇక్కడ ధోని సగటు 40.63గా ఉండగా, స్టైక్‌రేట్ 136. 67గా ఉంది. ఐపీఎల్‌లో ధోని 216 సిక్స్‌లు కొట్టగా, 313 ఫోర్లు సాధించాడు.
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ప్రధాన పేసర్ దీపక్ చహర్ నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 13 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో ఒక మెయిడెన్ కూడా ఉండటం విశేషం. అయితే ఈ నాలుగు వికెట్లను కూడా నాలుగు ప్రత్యేకమైన బంతులతో చహర్ దక్కించుకోవడం విశేషం. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికి ఒక అద్భుతమైన అవుట్ స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతికి నకుల్ బాల్‌తో గేల్‌ను బోల్తా కొట్టించాడు. ఆ మరుసటి బంతికే పూరన్‌ను షార్ట్‌పిచ్ బాల్‌తో పెవిలియన్‌కు చేర్చాడు.
దీంతో చహర్ హ్యాట్రిక్ తీసేట్లు కనిపించాడు. నాలుగో బంతిని ఇన్‌స్వింగర్ వేయగా... అదికాస్తా షారుఖ్ ఖాన్ ప్యాడ్‌లను తాకింది. అవుట్ కోసం చహర్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. దాంతో సీజన్‌లో తొలి హ్యాట్రిక్‌ను తీసే చాన్స్‌ను చహర్ మిస్ చేసుకున్నాడు. హాక్‌ఐలో బంతి వికెట్లపై నుంచి వెళ్తున్నట్లు కనిపించింది. ఆరో ఓవర్ రెండో బంతిని ఆఫ్‌స్టంప్ ఆవల ఊరిస్తూ వేయగా డ్రైవ్ చేసిన దీపక్ హుడా మిడాఫ్‌లో డు ప్లెసిస్ చేతికి చిక్కాడు. దాంతో చహర్ ఖాతాలో నాలుగో వికెట్ చేరింది.
స్కోరు బోర్డు
పంజాబ్: కేఎల్ రాహుల్ (రనౌట్) 5; మయాంక్ (బి) దీపక్ చాహర్ 0; గేల్ (సి) జడేజా (బి) దీపక్ చాహర్ 10; దీపక్ హూడా (సి) డుప్లెసి (బి) దీపక్ చాహర్ 10; పూరన్ (సి) ఠాకూర్ (బి) దీపక్ చాహర్ 0; షారుక్‌ఖాన్ (సి) జడేజా (బి) కర్రాన్ 47; రిచర్డ్‌సన్ (బి) మొయిన్ అలీ 15; మురుగన్ అశ్విన్ (సి) డుప్లెసి (బి) బ్రావో 6; షమి (నాటౌట్) 9; రిలే మెరిడిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 106/8; వికెట్ల పతనం: 1-1, 2-15, 3-19, 4-19, 5-26, 6-57, 7-87, 8-101; బౌలింగ్: దీపక్ చాహర్ 4-1-13-4; సామ్ కర్రాన్ 3-0-12-1; శార్దూల్ ఠాకూర్ 4-0-35-0; జడేజా 4-0-19-0; మొయిన్ అలీ 3-0-17-1; బ్రావో 2-0-10-1.
చెన్నై: రుతురాజ్ (సి) హూడా (బి) అర్ష్‌దీప్ 5; డుప్లెసి (నాటౌట్) 36; మొయిన్ అలీ (సి) షారుఖ్ (బి) ఎమ్.అశ్విన్ 46; రైనా (సి) రాహుల్ (బి) షమి 8; రాయుడు (సి) పూరన్ (బి) షమి 0; సామ్ కర్రాన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 15.4 ఓవర్లలో 107/4; వికెట్ల పతనం: 1-24, 2-90, 3-99; 4-99; బౌలింగ్: షమి 4-0-21-2; రిచర్డ్‌సన్ 3-0-21-0; అర్ష్‌దీప్ 2-0-7-1; మెరిడిత్ 3.4-0-21-0; ఎం.అశ్విన్ 3-0-32-1.