David Miller (Photo Credits; Twitter/IPL)

Mumbai, April 16: ఐపీఎల్ 2021 ఆసక్తికరంగా సాగుతోంది, తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లు ఉత్కంఠరేపుతున్నాయి. గురువారం రాజస్తాన్ మరియు దిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ అనేక మలుపులు తిరుగుతూ చివరకు అనూహ్యంగా రాజస్తాన్ వైపు మొగ్గింది. దీంతో ప్రత్యర్థి దిల్లీపై రాజస్తాన్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

టాస్ గెలిచిన రాజస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకొంది, దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌లో తడబడింది. ఆది నుంచే రాజస్తాన్ బౌలర్లు క్రమశిక్షణతో బాల్స్ వేస్తూ దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను ఎక్కడికక్కడే కట్టడి చేశారు.

రాజస్తాన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ నెప్పులు చెరిగే బంతులతో దిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్‌ను కూల్చాడు. ఉనద్కత్ ధాటికి శిఖర్ ధవన్, పృథ్వీ షాహ్, అజింక్యా రహానే లాంటి మేటి బ్యాట్స్‌మెన్ కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అయితే ఇక్కడ కళ్లు చెదిరే క్యాచ్ లు, చురుకైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్న రాజస్తాన్ ఫీల్డర్లను కూడా మెచ్చుకోవాలి. ఒకవైపు వికెట్లు పడుతున్నా దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం ఏ మాత్రం బెదరకుండా ఒంటరి పోరాటం చేశాడు. చూడచక్కని షాట్లతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన పంత్ 51 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు.  ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఫలితంగా దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. దిల్లీ ఇన్నింగ్స్ 20 ఓవర్లలో 1 సిక్స్ కూడా బ్యాట్స్‌మెన్ ఎవరూ కొట్టకపోవడం ఇక్కడ మరో విశేషం.

ఇక 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ బ్యాట్స్‌మెన్ కూడా పరుగులు చేయడానికి కష్టపడ్డారు. జోస్ బట్లర్, సంజూ శాంసన్, వోహ్రా, శివమ్ దుబే లాంటి రాజస్తాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే చేతులెత్తేశారు. 42 పరుగులకే రాజస్తాన్ 5 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో సీనియర్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు, తన క్లాస్ బ్యాటింగ్‌తో మిల్లర్ 43 బంతుల్లో 62 పరుగులు చేశాడు. 15.3 ఓవర్ల వద్ద మిల్లర్ కొట్టిన సిక్స్ ఈ మ్యాచ్‌కి తొలి సిక్స్ కావడం విశేషం. అంటే రెండు జట్ల ఓవర్లు కలిపితే 36వ ఓవర్లో మ్యాచ్‌లో తొలి సిక్స్ వెళ్లింది. వరుసగా 2 సిక్సర్లు కొట్టి ఊపు మీదున్న మిల్లర్, మూడో సిక్స్ కోసం ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మిల్లర్ ఔట్ అవడంతో మళ్లీ మ్యాచ్ దిల్లీ వైపు మొగ్గింది. 16 ఓవర్లకి రాజస్తాన్ స్కోర్ 105/7, అంటే విజయానికి కేవలం 24 బంతుల్లో 43 పరుగులు చేయాలి, రాజస్తాన్‌కు టెయిలెండర్లు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ స్థితిలో క్రిస్ మోరిస్ క్రీజులోకి వచ్చి అనూహ్యంగా చెలరేగాడు. 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మోరిస్ 200 స్ట్రైక్ రేట్‌తో 4 సిక్సర్లు బాది మ్యాచ్‌ను గెలిపించాడు. మోరిస్ ఎదురుదాడితో 19.4 ఓవర్లలోనే రాజస్తాన్ 150 పరుగులు చేసి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకోగా, తొలి మ్యాచ్ గెలిచిన దిల్లీ జట్టు రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. కాగా, ఈ మ్యాచ్ లో దిల్లీని తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆర్ఆర్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' గా ఎంపికయ్యాడు.

ఈరోజు పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ముంబై వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.