PBKS vs MI IPL 2021: ముంబైకు ముచ్చటగా మూడో ఓటమి, మళ్లీ గెలుపు బాట పట్టిన పంజాబ్, 9 వికెట్లతో ఘనవిజయం ముంబై ఇండియన్స్‌పై సాధించిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ 14 తొలి మ్యాచ్‌లో గెలిచి... ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడ్డ పంజాబ్ కింగ్స్ చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో (Punjab Kings Beat Mumbai Indians) ముంబై ఇండియన్స్‌పై 9 వికెట్లతో ఘనవిజయం (PBKS vs MI, IPL 2021 Stat Highlights) సాధించింది.
ఎట్టకేలకు మళ్లీ పంజాబ్ గెలుపుబాట పట్టింది. ఐపీఎల్ 14 తొలి మ్యాచ్‌లో గెలిచి... ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడ్డ పంజాబ్ కింగ్స్ చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో (Punjab Kings Beat Mumbai Indians) ముంబై ఇండియన్స్‌పై 9 వికెట్లతో ఘనవిజయం (PBKS vs MI, IPL 2021 Stat Highlights) సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విఫలమైన రోహిత్ శర్మ బృందం సీజన్‌లో మూడో ఓటమిని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆరంభంలోనే ఓపెనర్ డికాక్ (3) వికెట్‌ను కోల్పోయింది. దీపక్ హుడా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ చివరి బంతికి మిడాన్‌లో ఉన్న హెన్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి డికాక్ వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లలోనూ పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై స్కోరు 21/1. డికాక్ తర్వాత వచ్చిన యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (17 బంతుల్లో 6) ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
ఇషాన్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 7 ఓవర్ల తర్వాత 26/2 స్కోరుతో ముంబై కష్టాల్లో పడింది. కాగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి సూర్య కుమార్ (27 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) సహకారం అందించాడు. పంజాబ్ బౌలర్లు రవి బిష్ణోయ్ (2/21), షమీ (2/21) ప్రత్యర్థిని కట్టడి చేశారు.
అనంతరం పంజాబ్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 132 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... గేల్ (35 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిశాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు అజేయంగా 79 పరుగులు జోడించారు.
స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్ (20 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్) హిట్టింగ్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. కృనాల్ పాండ్యా వేసిన రెండో ఓవర్‌లో రాహుల్ రెండు ఫోర్లు కొట్టగా... మయాంక్ ఒక సిక్సర్ బాదడంతో 15 పరుగులు లభించాయి. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో రాహుల్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టాడు.
బౌల్ట్ బౌలింగ్‌లో మయాంక్ రెండు ఫోర్లు సాధించడంతో... పంజాబ్ 4 ఓవర్లలో 37 పరుగులు చేసింది. ఒత్తిడికి లోనైన మయాంక్... రాహుల్ చహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో 53 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్ కుదురుకోవడానికి ప్రయత్నించడం... మరో ఎండ్‌లో రాహుల్ కూడా తన దూకుడును తగ్గించడంతో మ్యాచ్‌పై ముంబై పట్టుబిగించేలా కనిపించింది. అయితే క్రీజులో కుదురుకున్నాక గేల్ షాట్లు ఆడటం మొదలు పెట్టాడు.
జయంత్ బౌలింగ్‌లో అతడు రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టగా... పొలార్డ్ వేసిన ఓవర్లో రాహుల్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో రాహుల్ 50 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సీజన్‌లో అతడికిది మూడో అర్ధ సెంచరీ. పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు అవసరమైన తరుణంలో... బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ తొలి బంతిని గేల్ సిక్సర్ కొట్టి రెండో బంతికి సింగిల్ తీశాడు. స్ట్రయిక్‌లోకి వచ్చిన రాహుల్ వరుస బంతుల్లో 6, 4 కొట్టి మ్యాచ్‌ను ముగించేశాడు.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) హెన్రిక్స్ (బి) దీపక్ హుడా 3; రోహిత్ శర్మ (సి) అలెన్ (బి) షమీ 63; ఇషాన్ కిషన్ (సి) రాహుల్ (బి) రవి బిష్ణోయ్ 6; సూర్యకుమార్ యాదవ్ (సి) క్రిస్ గేల్ (బి) రవి బిష్ణోయ్ 33; పొలార్డ్ (నాటౌట్) 16; హార్దిక్ పాండ్యా (సి) దీపక్ హుడా (బి) అర్‡్షదీప్ సింగ్ 1; కృనాల్ పాండ్యా (సి) పూరన్ (బి) షమీ 3; జయంత్ యాదవ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 131.
వికెట్ల పతనం: 1–7, 2–26; 3–105, 4–112, 5–122, 6–130.
బౌలింగ్: హెన్రిక్స్ 3–0–12–0, దీపక్ హుడా 3–0–15–1, షమీ 4–0–21–2, రవి బిష్ణోయ్ 4–0–21–2, ఫాబియాన్ అలెన్ 3–0–30–0, అర్‡్షదీప్ సింగ్ 3–0–28–1.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 60; మయాంక్ అగర్వాల్ (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) రాహుల్ చహర్ 25; క్రిస్ గేల్ (నాటౌట్) 43; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి) 132. వికెట్ల పతనం: 1–53.
బౌలింగ్: బౌల్ట్ 2.4–0–30–0, కృనాల్ పాండ్యా 3–0–31–0, బుమ్రా 3–0–21–0, రాహుల్ చహర్ 4–0–19–1, జయంత్ యాదవ్ 4–0–20–0, పొలార్డ్ 1–0–11–0.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రాహుల్