IPL 2023,PBKS vs RCB: నిప్పులు చెరిగే బంతులతో పంజాబ్ బ్యాటర్ల భరతం పట్టిన సిరాజ్, 24 పరుగుల తేడాతో PBKSపై ఘన విజయం సాధించిన ఆర్సీబీ
ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో తన జట్టుకు విజయాన్నందించాడు. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS) ఓటమి పాలైంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి బెంగళూరు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. స్టాండిన్ కెప్టెన్ కోహ్లీ 59, డుప్లెసిస్ 84 పరుగులు చేశారు. అనంతరం బెంగళూరు నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 150 పరుగులకు ఆలౌట్ అయింది.
తొలి బంతి నుంచే పంజాబ్ బ్యాటర్లను వణికించిన బెంగళూరు బౌలర్ సిరాజ్(siraj) తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ అథర్వ టైడె (4)ను పెవిలియన్ పంపి దెబ్బ కొట్టాడు. ఇక అప్పుడు మొదలైన వికెట్ల పతనం చివరి వరకు కొనసాగింది. నాలుగు వికెట్లు తీసిన సిరాజ్ పంజాబ్ ఓటమికి కారణమయ్యాడు.చివర్లో జితేశ్ శర్మ(Jitesh Sharma) ప్రత్యర్థి శిబిరంలో కాసేపు కలవరం రేపాడు.
27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేసిన జితేశ్‌ను హర్షల్ పటేల్ వెనక్కి పంపడంతో బెంగళూరు ఊపిరి పీల్చుకుంది. కెప్టెన్ శామ్ కరన్ (10) రనౌట్ రూపంలో వెనుదిరగడం పంజాబ్ అవకాశాలను దెబ్బతీసింది. మరో హార్డ్ హిట్టర్ షారుఖ్ కాన్ వచ్చీ రావడంతోనే ఓ సిక్స్ బాదినా, అదే ఊపు కంటిన్యూ చేయలేక 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.
ఇక, పంజాబ్ జట్టులో ప్రభ్‌సిమ్రన్ సింగ్ చేసిన 46 పరుగులే అత్యధికమని చెప్పాలి. ఆ తర్వాత జితేశ్ శర్మ చేసిన 41 పరుగులు తప్ప మిగతా ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఫలితంగా 18.2 ఓవర్లలోనే పంజాబ్ ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 4, హసరంగ రెండు వికెట్లు తీసుకున్నారు.