Shikhar Dhawan Retirement: క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన 'గబ్బర్'.. ఎమోషనల్ వీడియో
ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ ఫార్మెట్ ల నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ఈ ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు.
Newdelhi, Aug 24: టీమిండియా ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) క్రికెట్ కు (Cricket) వీడ్కోలు (Retirement) పలికారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ ఫార్మెట్ ల నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ఈ ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు ఇంతకాలం అండగా ఉన్న అభిమానులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్ కి, టీమిండియాకు, బీసీసీఐకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
వీడియోలో ఏమన్నారంటే?
‘క్రికెట్ ప్రయాణంలో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నా. లెక్కలేనన్ని జ్ఞాపకాలను, కృతజ్ఞతా భావాన్ని వెంట తీసుకువెళుతున్నా. నాపై అభిమానులు చూపించిన ప్రేమకు.. అడుగడుగునా మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జై హింద్’ అంటూ శిఖర్ ధావన్ వీడియోలో కాస్త ఎమోషనల్ అయ్యారు.
రికార్డుల హోరు
34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన 38 ఏళ్ల శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ లో తన చివరి మ్యాచ్ 10 డిసెంబర్ 2022న బంగ్లాదేశ్ తో చిట్టగాంగ్ లో ఆడారు. 2022 నుండి టీమిండియాకు దూరంగా ఉంటున్నారు. 167 వన్డేల్లో 6,793 పరుగులు, 34 టెస్టుల్లో 2,315 పరుగులు, 68 టీ20ల్లో 1,759 పరుగులు బాదాడు. ఇక వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు నమోదు చేశారు మన 'గబ్బర్'.