
Hyderabad, Feb 24: చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు (India Vs Pakistan Match) మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా. అందుకే ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ జట్లు ఆడుతుంటే చూసేందుకు ప్రముఖులంతా దుబాయ్ తరలి వెళ్లారు. కోట్లాది మంది అభిమానులు టీవీలకు, ఫోన్ లకు అతుక్కుపోయారు. కాగా.. ఈ మ్యాచ్ ప్రాధాన్యతను గుర్తించిన ఓ వరుడు తన స్నేహితుల కోసం పెళ్లి మండపంలోనే మ్యాచ్ లైవ్ చూసే ఏర్పాట్లు చేశాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన మస్కరి మణిశర్మ, సాయిప్రియల వివాహం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. అదే మండపంలో పెళ్లి వీడియో వీక్షించాల్సిన తెరపై దాయాదుల పోరును ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే ఏర్పాటు చేశారు. అటు స్నేహితుడి పెళ్లి వేడుకను.. ఇటు ఉత్కంఠ రేపే క్రికెట్ మ్యాచ్ ను ఒకే ప్రాంగణంలో చూడటం ఆనందంగా ఉందని వరుడి స్నేహితులు పేర్కొన్నారు.
పెళ్లి వేడుకలో #INDvsPAK క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం. pic.twitter.com/QGQP6BPgXk
— ChotaNews App (@ChotaNewsApp) February 24, 2025
గెలుపు ఇలా..
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఆదివారం నీటి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. విరాట్ కోహ్లీ (100 నాటౌట్; 111 బంతుల్లో 7 ఫోర్లు) శతకంతో చెలరేగడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగు అయ్యాయి. పాకిస్తాన్ టోర్నీ నుంచి దాదాపుగా నిష్ర్కమించింది. శ్రేయస్ అయ్యర్ (56; 67 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. శుభ్‌మన్ గిల్ (46; 52 బంతుల్లో 7 ఫోర్లు) రాణించాడు. రోహిత్ శర్మ (20) ఫర్వాలేదనిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, షాహీన్ అఫ్రిది, ఖుష్‌దిల్ షా లు తలా ఓ వికెట్ సాధించారు.