Sourav Ganguly Hospitalised: సౌరవ్ గంగూలీకి గుండెపోటు, ఆపరేషన్ చేయాలని సూచించిన వైద్యులు, కలకత్తాలోని ఉడ్‌ల్యాండ్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిక
కాగా వైద్యులు హార్ట్ ఎటాక్‌గా నిర్ధారించి ఆపరేషన్ చేయాలని సూచించారు. కొన్ని రిపోర్టుల ప్రకారం.. ఉదయం జిమ్‌లో ఉండగా ఉన్నట్లుండి కళ్లు చీకట్లు కమ్మడం, తీవ్రమైన ఛాతీ నొప్పితో (Sourav Ganguly Heart Problems) గంగూలీ బాధపడ్డారు.
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. కాగా వైద్యులు హార్ట్ ఎటాక్‌గా నిర్ధారించి ఆపరేషన్ చేయాలని సూచించారు. కొన్ని రిపోర్టుల ప్రకారం.. ఉదయం జిమ్‌లో ఉండగా ఉన్నట్లుండి కళ్లు చీకట్లు కమ్మడం, తీవ్రమైన ఛాతీ నొప్పితో (Sourav Ganguly Heart Problems) గంగూలీ బాధపడ్డారు.
దీంతో అక్కడి సిబ్బంది ఆయనను హుటాహుటిన దగ్గరలోని ఉడ్‌ల్యాండ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి (Sourav Ganguly Hospitalised) తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. హృదయపు నాళాల్లో అడ్డంకులు ఏర్పడడమే ఛాతీ నొప్పికి కారణంగా గుర్తించారు.
సాయంత్రంలోపు ఆంజియోప్లాస్టీ(గుండె నాళాల్లో అడ్డంకులు తొలగింపు) చికిత్స చేయడం జరుగుతుందని చెప్పారు. దీనికోసం ఆసుపత్రి యాజమాన్యం ముగ్గురు స్పెషలిస్ట్ వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. చికిత్స పూర్తయిన తరువాత త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. గంగూలీ ఆసుపత్రిలో చేరినప్పడు క్లినికల్ పారామీటర్లు అన్నీ నార్మల్‌గానే ఉన్నట్టు ఉడ్‌ల్యాండ్ ఆసుపత్రి ఎండీ, సీఈవో డాక్టర్ రూపాలీ బసు తెలిపారు.
సౌరవ్ గంగూలీ ఆసుపత్రిలో చేరడంపై ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ నేత నగ్మా స్పందించారు. గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆమె.. ఆయన కోసం ప్రార్థనలు చేస్తున్నట్టు తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని బోర్డు కార్యదర్శి జే షా వెల్లడించారు. ప్రస్తుతం దాదా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తాను గంగూలీ కుటుంబంతో మాట్లాడానని, దాదా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు జే షా ట్వీట్ చేశారు.
అటు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా గంగూలీ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు. ఐసీసీ కూడా స్పందించింది. గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ట్వీట్ చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, స్టాండిన్ కెప్టెన్ అజింక్య రహానే కూడా గంగూలీ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు.