U-19 Asia Cup: పాక్ జట్టు చేతిలో టీమిండియా ఓటమి, భారత్ సెమీస్ వెళ్లాలంటే 50-50 ఛాన్స్, అండర్ -19 ఆసియా కప్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ అగ్రస్థానం
పాక్ బ్యాటర్లలో అజాన్ అవైస్ (Azan Awais) శతకంతో చెలరేగాడు. కెప్టెన్ సాద్ బేగ్ (68 నాటౌట్; 51 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), షాజైబ్ ఖాన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మురుగన్ అభిషేక్ రెండు వికెట్లు తీశాడు. మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు.
Dubai, DEC 10: దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో (U-19 Asia Cup) టీమ్ఇండియాకు షాక్ తగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు పాకిస్తాన్ (Pakistan Beat India ) చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. 260 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 47 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాటర్లలో అజాన్ అవైస్ (Azan Awais) (105; నాటౌట్ 130 బంతుల్లో 10 ఫోర్లు) శతకంతో చెలరేగాడు. కెప్టెన్ సాద్ బేగ్ (68 నాటౌట్; 51 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), షాజైబ్ ఖాన్ (63; 88 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మురుగన్ అభిషేక్ రెండు వికెట్లు తీశాడు. మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్ (62; 81 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ ఉదయ్ సహరన్ (60; 98 బంతుల్లో 5 ఫోర్లు), సచిన్ దాస్ (58; 42 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ జీషన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అమీర్ హసన్, ఉబైద్ షాలు చెరో రెండు వికెట్లు తీశారు. లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచులో విజయం సాధించిన పాకిస్తాన్ (Pakistan Beat India) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
అఫ్గానిస్థాన్ పై గెలిచిన భారత్.. పాకిస్థాన్ పై ఓడిపోయింది. దీంతో సెమీఫైనల్‌లో టీమ్ఇండియా అడుగుపెట్టాలంటే తన చివరి లీగ్ మ్యాచులో నేపాల్ ను ఓడించాల్సి ఉంటుంది. మంగళవారం భారత్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా.. నేపాల్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది.