Sachin Tendulkar: జీవితంలో రెండు కోరికలు తీరలేదని బాధపడుతున్న సచిన్, అవి కలగానే మిగిలిపోయాయని ఇంటర్వ్యూలో తెలిపిన లిటిల్ మాస్టర్, అవేంటో తెలుసుకుందామా..
తన జీవితంలో రెండు కోరికలు కలగానే మిగిలిపోయాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
క్రికెట్ దిగ్గజం లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అసాధ్యమనుకున్న ఎన్నో రికార్డులను తిరగరాసి, భారత క్రికెట్ రూపురేఖలను మార్చివేసిన ఘనత సచిన్ టెండుల్కర్ కే (Sachin Tendulkar) చెందుతుంది. అయితే దిగ్గజ క్రికెటర్ కూడా తన జీవితంలో కొన్ని కోరికలను నెరవేర్చుకోలేకపోయాడట. తన జీవితంలో రెండు కోరికలు కలగానే మిగిలిపోయాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డుతో పాటు అంతర్జాతీయ కెరీర్‌లో 100 సెంచరీల మైలురాయిని అందుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచిన ఈ భారతరత్నం.. తన కెరీర్‌లో రెండు కోరికలు నెరవేరకపోవడం ఇప్పటికీ కలచివేస్తుందని వాపోయాడు. అీవేంటంటే.. చిన్నతనం నుంచి తన బ్యాటింగ్ హీరోగా భావించే సునీల్ గవాస్కర్‌తో (Sunil Gavaskar,) కలిసి ఆడలేకపోవడాన్ని మొదటి కోరికగా చెప్పాడు, అలాగే తను పిచ్చిగా ఆరాధించే సర్ వివియన్రిచర్డ్స్ కు (Sir Vivian Richards) ప్రత్యర్ధిగా ఆడలేకపోవడాన్ని రెండో కోరికగా చెప్పాడు. తన క్రికెటింగ్ కెరీర్‌లో రెండు లోటుపాట్లుగా భావిస్తానని చెప్పుకొచ్చాడు.
సునీల్ గవాస్కర్ రిటైర్ అయిన రెండేళ్లకు సచిన్ క్రికెట్లోకి అరంగేట్రం చేయడం వల్ల అతనితో డ్రెసింగ్ రూమ్ షేర్ చేసుకునే అవకాశం దక్కలేదని, 80, 90 దశకాల్లో క్రికెట్ ఆడిన ప్రతి ఆటగాడికి సన్నీతో కలిసి ఆడటం అనేది ఓ కల అని సచిన్ వివరించాడు. మరోవైపు వివ్ రిచర్డ్స్‌తో కలిసి కౌంటీ క్రికెట్ ఆడటాన్ని అదృష్టంగా భావిస్తానని, సర్ లాంటి డాషింగ్ బ్యాట్స్‌మెన్‌కు ప్రత్యర్ధిగా ఉంటే ఆ కిక్కే వేరని పేర్కొన్నాడు.
తాను అరంగేట్రం చేసిన తర్వాతే వివ్ రిచర్డ్స్ రిటైర్డ్ అయినప్పటికీ అంతర్జాతీయ వేదికపై తామెప్పుడూ ఎదురెదురు పడలేదని, ఈ లోటు తనను జీవితాంతం బాధిస్తుందని చెప్పుకొచ్చాడు. కాగా, 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సచిన్.. 2013లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ 24 ఏళ్ల కెరీర్‌లో 463 వన్డేలు, 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సచిన్.. దాదాపు 35000 వేల పరుగులు సాధించాడు. ఇందులో 100 శతకాలు, 164 అర్ధశతకాలు ఉన్నాయి.