Colombo, May 23: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి క్రీడారంగంపైనా పెను ప్రభావం చూపుతోంది.ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్ అర్ధంతరంగా ముగియగా, ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీపైనా కరోనా ప్రభావం పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక దేశాలు తమ షెడ్యూళ్లను మార్చుకోవడంతో, 2021 క్యాలెండర్ లో ఆసియా కప్ కు (Asia Cup 2021) స్థానం కల్పించడం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కు శక్తికి మించిన పనైంది. ఇందులో భాగంగా ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ (T20 Tournament Postponed) రద్దయింది.
జూన్ నెలలో శ్రీలంక నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్ చేసింది. అయితే కరోనా కేసుల (COVID-19 Pandemic) నేపథ్యంలో ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహించలేకపోతున్నామని శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అష్లే డిసిల్వా ప్రకటించారు. 2023లో వన్డే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత దీన్ని నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా నేతృత్వంలోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
సెప్టెంబర్‌లో నిర్వహించాలనుకున్న ఆసియా కప్ 2020 టోర్నమెంట్‌ను జూన్ 2021కి వాయిదా వేశారు. కానీ కోవిడ్19 తీవ్రత భారత్ (Team India), శ్రీలంక, ఇతర ఆసియా దేశాలలో అధికం ఉండటంతో ట్రోఫీని రద్దు చేయడమే సరైన నిర్ణయంగా భావించారు. వాస్తవానికి ఈ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ అతిథ్యమివ్వాల్సింది. కానీ, భారత్- పాక్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత ఆటగాళ్లు అక్కడ పర్యటించే అవకాశం లేకపోవడంతో దీనిని శ్రీలంకకు మార్చారు. మరోవైపు, శ్రీలంకలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 10 రోజులపాటు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆసియా కప్ ను రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. వివిధ కారణాలతో 2018 నుంచి ఆసియా కప్ నిర్వహణ సాధ్యం కావడంలేదు. 2020లో నిర్వహిద్దామని అనుకుంటే కరోనా ఫస్ట్ వేవ్ అందుకు గండికొట్టింది. ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా ఆసియా కప్ కు అవాంతరాలు సృష్టిస్తోంది.