T20 World Cup 2022: ఘోర పరాభవంతో ప్రపంచకప్ నుండి వైదొలిగిన వెస్టిండీస్‌, పసికూన ఐర్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన పూరన్‌ బృందం, సూపర్‌-12కు అర్హత సాధించిన ఐర్లాండ్

అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఐర్లాండ్‌ సూపర్‌-12కు అర్హత సాధించింది.

West Indies Out of T20 World Cup 2022

రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌కు టీ20 వరల్డ్‌కప్‌-2022లో ఘోర పరాభవం ఎదురైంది.గ్రూప్‌-బి క్వాలిఫైయర్స్‌లో భాగంగా ఐర్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన పూరన్‌ బృందం చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఐర్లాండ్‌ సూపర్‌-12కు అర్హత సాధించింది.క్వాలిఫైయర్స్‌లో భాగంగా హోబర్ట్‌ వేదికగా చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ ఐరిష్‌ బౌలర్లు చెలరేగడంతో టాపార్డర్‌ విఫలమైంది.

ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రాండన్‌ కింగ్‌ 48 బంతుల్లో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో.. జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. బ్రాండన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఐర్లాండ్‌ బౌలర్లలో బ్యారీ మెకార్తీకి ఒకటి, సిమీ సింగ్‌కు ఒకటి, గరెత్‌ డిలానీకి మూడు వికెట్లు లభించాయి.

క్రికెట్ అభిమానులకు పిడుగులాంటి వార్త.. ఎల్లుండి మెల్బోర్న్ వేదికగా జరుగనున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు వాన గండం.. వర్షసూచన వెలువరించిన ఆస్ట్రేలియా వాతావరణ శాఖ

లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌కు ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ అదిరిపోయే ఆరంభం అందించాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 66 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ 37 పరుగులతో రాణించగా.. లోర్కాన్‌ టకర్‌ 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ముగ్గురి విజృంభణతో 17.3 ఓవర్లలోనే ఐర్లాండ్‌ టార్గెట్‌ను ఛేదించింది.