Netherlands Beat Bangladesh: వరల్డ్ కప్‌లో మరో సంచలనం, బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించిన నెదర్లాండ్స్, కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన ఎడ్వర్డ్స్

ఈ మెగా టోర్నీలో నెద‌ర్లాండ్స్ (Netherlands) మ‌రో జ‌ట్టుకు షాకిచ్చింది. మొన్న సౌతాఫ్రికాను ఓడించిన నెద‌ర్లాండ్స్ నేడు బంగ్లాదేశ్‌కు (Bangladesh) షాకిచ్చింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా బంగ్లాదేశ్ తో జ‌రిగిన మ్యాచ్‌లో 87 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

Netherlands Beat Bangladesh (PIC@ Kaif X)

Kolkata, OCT 28: భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (CWC-23) సంచ‌ల‌నాల‌కు నెల‌వుగా మారింది. ఈ మెగా టోర్నీలో నెద‌ర్లాండ్స్ (Netherlands) మ‌రో జ‌ట్టుకు షాకిచ్చింది. మొన్న సౌతాఫ్రికాను ఓడించిన నెద‌ర్లాండ్స్ నేడు బంగ్లాదేశ్‌కు (Bangladesh) షాకిచ్చింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా బంగ్లాదేశ్ తో జ‌రిగిన మ్యాచ్‌లో 87 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 230 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ 42.2వ ఓవ‌ర్‌లో 142 ప‌రుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బ్యాట‌ర్ల‌లో మెహిదీ హసన్ మిరాజ్ (35; 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఫ‌ర్వాలేద‌నిపించాడు. మహ్మదుల్లా (20), ముస్తాఫిజుర్ రెహమాన్ (20), మహేదీ హసన్ (17), తాంజిద్ హసన్ (15) లు రెండు అంకెల స్కోరు సాధించారు. లిట‌న్ దాస్ (3), నజ్ముల్ హుస్సేన్ శాంటో (9), కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (5), ముష్ఫికర్ రహీమ్ (1) లు విఫ‌లం కావ‌డంతో బంగ్లాదేశ్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌లో పాల్ వాన్ మీకెరెన్ నాలుగు వికెట్లు తీశాడు. బాస్ డి లీడే రెండు ప‌డ‌గొట్టాడు. లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కోలిన్ అకెర్మాన్ త‌లా ఓ వికెట్ సాధించారు.

 

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన నెద‌ర్లాండ్స్ (Netherlands) నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 229 ప‌రుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (68; 89 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. వెస్లీ బరేసి 41, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 35, లోగాన్ వాన్ బీక్ 23* ప‌రుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్ లు త‌లా రెండు వికెట్లు తీశారు. కెప్టెన్ ష‌కీబ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెద‌ర్లాండ్స్‌కు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు షాకులు త‌గిలాయి. 4 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈద‌శ‌లో అకెర్మాన్ (15)తో జట్టు కట్టిన బరేసి నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దాడు. హాఫ్ సెంచ‌రీ దిశగా సాగుతున్న బరేసిని ముస్తాఫిజుర్ పెవిలియ‌న్‌కు చేర్చాడు. త‌రువాతి ఓవ‌ర్‌లోనే షకీబ్ బౌలింగ్‌లో అకెర్మాన్‌ కూడా ఔట్ అయ్యాడు.

బాస్ డి లీడే కూడా పెవిలియ‌న్‌కు చేర‌డంతో నెద‌ర్లాండ్స్ 107 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయింది. అప్ప‌టికే క్రీజులో కుదురుకున్న‌ ఎడ్వర్డ్స్‌.. సిబ్రాండ్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈ ఇద్ద‌రు నిలకడగా ఆడి ఆరో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్ప‌డంతో నెద‌ర్లాండ్స్ స్కోరు 200 దాటింది.