Asian Para Games: ఆసియా పారాగేమ్స్ లో కొనసాగుతున్న భారత్ జోరు, జావెలిన్ త్రో ఎఫ్ 64 విభాగంలో గోల్డ్ సాధించిన సుమిత్, కాంస్యం సాధించిన మరో ఇండియన్ ప్లేయర్ పుష్పేంద్ర సింగ్
73.29 మీటర్ల దూరం బళ్లెం విసిరిన సుమిత్.. స్వర్ణం దక్కించుకున్నాడు. దీంతో పారా ఆసియా క్రీడలతోపాటు ప్రపంచ రికార్డు, ఆసియా రికార్డును తన పేరున లిఖించుకున్నాడు.
China, OCT 25: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో (Asian Para Games) భారత్ (India) జోరు కొనసాగుతున్నది. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో (Asian Games) వంద పతకాల మార్క్ దాటి చరిత్ర లిఖించగా.. ఇప్పుడు పారా ఆసియా క్రీడల్లోనూ మనవాళ్ల మెడల్స్ వేట కొనసాగిస్తున్నారు. మెన్స్ జావెలిన్ త్రో-ఎఫ్64 విభాగం ఫైనల్‌లో భారత అథ్లెట్లు సుమిత్ (Sumit Antil), పుష్పేంద్ర సింగ్ (Pushpendra Singh) పతకాలు సొంతంచేసుకున్నారు. 73.29 మీటర్ల దూరం బళ్లెం విసిరిన సుమిత్.. స్వర్ణం దక్కించుకున్నాడు. దీంతో పారా ఆసియా క్రీడలతోపాటు ప్రపంచ రికార్డు, ఆసియా రికార్డును తన పేరున లిఖించుకున్నాడు.
ఇక ఇదేవిభాగంలో 62.06 మీటర్ల దూరం విసిరిన పుష్పేంద్ర సింగ్ కాంస్యం గెలుపొందాడు. శ్రీలంక ఆటగాడు సమిత 62.42 మీటర్లతో సిల్వర్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, పారా ఆసియా క్రీడల్లో 36 పతకాలతో పట్టికలో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతున్నది. ఇందులో 10 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. 2018లో జరిగిన పారా ఆసియా క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు సహా 72 పతకాలు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసారి పారా క్రీడల్లో భారత్ భారీ బలగంతో బరిలోకి దిగింది. 303 అథ్లెట్లు పాల్గొన్నారు.