Gold Price (PIC @ X)

New Delhi, March 06: బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు (Gold loans) సంబంధించిన నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా రుణాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అడ్డుకొనేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పూచీకత్తుకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఆ రుణాన్ని దేనికి వినియోగిస్తున్నారో పర్యవేక్షించేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ ఓ కథనం ప్రచురించింది.

EPF withdrawal via UPI: ఇక పీఎఫ్‌ విత్‌డ్రా చేయడం చాలా సులభం, యూపీఐ ద్వారా కూడా విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్న కేంద్రం 

బంగారంతో తీసుకుని వెళితే నిమిషాల వ్యవధిలో రుణం మంజూరు అవుతుండడంతో చాలా మంది ఈ తరహా రుణాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అసురక్షిత రుణాలకు ఆర్‌బీఐ అడ్డుకట్ట వేసిన నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈ తరహా రుణాలు మరింత పెరిగాయి. అయితే, రుణాలు తీసుకునేటప్పుడు వారి పూర్వాపరాలు, తనఖా పెడుతున్న బంగారం వారిదేనా? కాదా? వంటివి కూడా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ధ్రువీకరించాలని ఆర్‌బీఐ భావిస్తోంది. రుణాల జారీలో ఆర్థిక సంస్థలన్నీ ఒకే తరహా విధివిధానాలు పాటించేలా చర్యలు తీసుకోనుంది.

దేశవ్యాప్తంగా బంగారం తాకట్టు రుణాల మంజూరులో గతేడాది కొన్ని లోపాలను ఆర్‌బీఐ గుర్తించింది. రుణం ఇచ్చే సమయంలోనే బంగారం విలువ నిర్ధరణతో పాటు ప్రాసెసింగ్‌ రుసుములు, వడ్డీ విషయంలో వేర్వేరు పద్ధతులను ఆర్థిక సంస్థలు అనుసరిస్తున్నట్లు ఆర్‌బీఐ దృష్టికొచ్చింది. ఒకే పాన్‌కార్డుపై ఒకే ఏడాది అనేకమార్లు బంగారం తాకట్టు రుణాలు ఎలా మంజూరు చేస్తున్నారంటూ ప్రశ్నించింది. రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైన వారికి సమాచారం లేకుండానే వారి బంగారాన్ని వేలం వేస్తున్న ఉదంతాలనూ గుర్తించింది. మొత్తంగా ఆర్థిక సంస్థలేవీ ఒకే తరహా విధానాలు పాటించడం లేదన్న నిర్ణయానికొచ్చిన ఆర్‌బీఐ.. బంగారం తాకట్టు రుణాల జారీ నుంచి ఆ నగదు వినియోగం, వేలం ఇలా ప్రతి దానికీ విధివిధానాలను ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.