Tokyo Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్ మెరుపులు, బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన ప్రమోద్‌ భగత్‌, కాంస్యం గెలిచిన షట్ల‌ర్ మ‌నోజ్ స‌ర్కార్‌, 17 పతకాలతో పట్టికలో 25వ స్థానానికి ఎగబాకిన ఇండియా

ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ (Pramod Bhagat Wins Gold ) ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌ టూ ర్యాంకర్‌, గ్రేట్‌ బ్రిటన్‌ షట్లర్‌ డేనియెల్‌ బెథెల్‌ను 21-11 21-16 తేడాతో మట్టికరిపించాడు.

Tokyo Paralympics Medal (Photo Credits: Twitter)

పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌(SL3)లో భారత్‌ తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ (Pramod Bhagat Wins Gold ) ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌ టూ ర్యాంకర్‌, గ్రేట్‌ బ్రిటన్‌ షట్లర్‌ డేనియెల్‌ బెథెల్‌ను 21-11 21-16 తేడాతో మట్టికరిపించాడు. పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు బ్యాడ్మింటన్‌లో ఇదే తొలి పతకం కావడం విశేషం. ఇక మ‌నీశ్ న‌ర్వాల్  పారాలింపిక్స్‌లో (Tokyo Paralympics 2020) గోల్డ్ మెడ‌ల్ సాధించి.. యువ సూప‌ర్‌స్టార్ అయ్యాడు. అర్జున అవార్డు గ్ర‌హీత అయిన మ‌నీశ్ న‌ర్వాల్‌.. 2001, అక్టోబ‌ర్ 17న జ‌న్మించాడు.

టోక్యోలో జ‌రుగుతున్న పారాఒలింపిక్స్‌లో పీ4 50మీ ఎయిర్ పిస్తోల్ ఎస్‌హెచ్‌1 ఈవెంట్‌లో మ‌నీశ్ అంద‌ర్నీ స్ట‌న్ చేస్తూ గోల్డ్ మెడ‌ల్ కొట్టేశాడు. నిజానికి ఇదే టోర్న‌మెంట్‌లో 10మీ ఎయిర్ పిస్తోల్ పోటీలో ప‌త‌కాన్ని చేజిక్కించుకోలేక‌పోయిన న‌ర్వాల్‌.. 50 మీ పిస్తోల్ ఈవెంట్‌లో మాత్రం త‌న స‌త్తా చాటాడు. మ‌రో షూట‌ర్ అదాన సింగ‌రాజ్ ఈ ఈవెంట్‌లో 216.7 పాయింట్లు స్కోర్ చేశారు. సింగ‌రాజ్‌కు ఈ గేమ్స్‌లో ఇది రెండ‌వ మెడ‌ల్ కావ‌డం విశేషం. ఇక బ్యాట్మింటన్ SL3 కేటగిరిలో మనోజ్ సర్కార్ కాంస్య పతకం సాధించాడు. జపాన్ షెట్ల‌ర్ దైసుకే ఫుజిహ‌రాను వ‌రుస సెట్ల‌లో 22-20, 21-13 తేడాతో ఓడించి కాంస్య ప‌తకాన్ని ఒడిసిప‌ట్టాడు.

పారాలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఆటగాడు, జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన సుమిత్ అంటిల్, తన ప్రపంచ రికార్డును తానే తిరగరాసుకున్న సుమిత్

హైజంప్‌లో ప్రవీణ్‌ కుమార్‌ రజత కాంతులు విరజిమ్మితే.. విశ్వక్రీడల్లో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన షూటర్‌ అవని మరో కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఆర్చరీలో హర్విందర్‌ సింగ్‌ గురి కుదరడంతో భారత్‌కు మరో కాంస్యం దక్కింది. దీంతో భారత్‌ 17 పతకాలతో పట్టికలో 25వ స్థానానికి ఎగబాకింది. ఆదివారంతో ముగియనున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్‌ మొత్తం 17 (4 స్వర్ణాలు, 7 రజతాలు, 6  కాంస్యాలు) పతకాలు సాధించింది.

శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్‌ (టీ64)లో 2.07 మీటర్ల ఎత్తు దూకిన 18 ఏండ్ల ప్రవీణ్‌ కుమార్‌ రజతం సాధించడంతో పాటు ఆసియా రికార్డును బద్దలు కొడుతూ.. భారత్‌ తరఫున విశ్వక్రీడల్లో పతకం నెగ్గిన అతి పిన్నవయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. మహిళల 50 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ త్రి పొజిషన్‌ ఎస్‌హెచ్‌1 ఈవెంట్‌లో 19 ఏండ్ల అవని 445.9 పాయింట్లతో కాంస్యం నెగ్గడం ద్వారా.. పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా చరిత్రకెక్కింది. వ్యక్తిగత రికర్వ్‌ ఆర్చరీలో హర్విందర్‌ సింగ్‌ కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. పారాలింపిక్స్‌ ఆర్చరీ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.