
పారాలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. పారాలింపిక్స్‌లో భారత ఆటగాడు సుమిత్ అంటిల్ చరిత్ర సృష్టించాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-64 విభాగంలో సుమిత్ అంటిల్ బంగారు పతకాన్ని (Sumit Antil Wins Gold Medal) ముద్దాడాడు. ఈ క్రమంలో మూడుసార్లు ప్రపంచ రికార్డు ( Record-Breaking Performance in Men’s Javelin Throw) నెలకొల్పాడు. తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అతడు.. రెండో ప్రయత్నంలో 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే తిరగరాశాడు.
ఇక ఐదో ప్రయత్నంలో మరింత వేగంతో ఈటెను విసరగా అది 68.55 మీటర్లు దూసుకెళ్లడంతో కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో సుమిత్ పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ ఇవాళ మొత్తం ఐదు పతకాలు సాధించగా.. అందులో ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. హరియాణాలోని సోనేపట్‌కు చెందిన సుమిత్ 2015లో జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో ఎడమకాలు పోగొట్టుకొని కృత్రిమకాలుతో జీవనం సాగిస్తున్నాడు. తన ఊర్లో ఉండే ఒక పారా అథ్లెట్‌ను చూసి సుమిత్ కూడా అథ్లెటిక్స్ వైపు దృష్టి మళ్లించాడు. అలా 2018లో జావెలిన్ త్రో విభాగంలో పోటీపడటం ప్రారంభించి ఇప్పుడు పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించేవరకు తనని తాను తీర్చిదిద్దుకున్నాడు.
ఈ క్రమంలోనే 2019లో దుబాయ్‌లో నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఎఫ్-64 విభాగంలోనే పోటీపడి రజతం సాధించాడు. ఇక ఈ ఏడాది మార్చిలో పాటియాలాలో నిర్వహించిన ఇండియన్ గ్రాండ్ ప్రి సిరీస్ 3 పోటీల్లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాతో పోటీపడ్డాడు. అయితే, సుమిత్ అప్పుడు 66.43 మీటర్లతో ఏడో స్థానంలో సరిపెట్టుకున్నాడు. మరోవైపు చోప్రా 88.07 మీటర్లతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
సుమిత్ ప్రదర్శనపై ఒలంపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా హర్షం వ్యక్తం చేశాడు. అతనికి అభినందనలు తెలిపారు.